శ్రీదేవి పట్టుబట్టి చేయించిందట

శ్రీదేవి పట్టుబట్టి చేయించిందట

శ్రీదేవి చనిపోవడానికి ముందు చివరగా చేసిన సినిమా ‘మామ్’. ఈ చిత్రంలో నటనకు గాను ఇటీవలే శ్రీదేవికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందించారు. కానీ ఆ అవార్డు అందుకోవడానికి ఆమె లేరు. ఈ సినిమాతో పాటు తమిళంలో చేసిన ‘కాట్రు వేళయిదే’ చిత్రానికి కూడా కలిపి ఎ.ఆర్.రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగానూ ఎంపికయ్యారు.

ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూల మాట్లాడుతూ శ్రీదేవితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు రెహమాన్. ‘మామ్’ సినిమాకు తానే సంగీతం అందించాలని శ్రీదేవి పట్టుబట్టి మరీ ఈ సినిమాకు ఒప్పించినట్లు అతను వెల్లడించాడు.

‘మామ్’ సినిమా మొదలవడానికి ముందు శ్రీదేవి ఒకసారి చెన్నైకి వచ్చిందని.. ఆ సందర్భంగా తనను కలిసిందని.. తనతో పని చేయాలని ఉందని చెప్పిందని రెహమాన్ తెలిపాడు. ఆమె మాట మీదే ‘మామ్’ సినిమాకు సంగీతం అందించానని.. ఈ చిత్ర నేపథ్య సంగీతం చాలా ప్రత్యేకమైందని రెహమాన్ అన్నాడు. ‘మామ్’ సినిమాలో శ్రీదేవి అద్భుతంగా నటించిందని.. ఆమె ఇంత హఠాత్తుగా చనిపోవడం బాధాకరమైన విషయమని రెహమాన్ అన్నాడు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కాట్రు వేళయిదే’ (తెలుగులో చెలియా) కూడా ప్రత్యేకమైన సినిమా అని.. తనకు సంగీత దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన మణిరత్నం అంటే తనకు ఎప్పుడూ అభిమానమే అని.. తాను ఎంత క్రూరమైన ట్యూన్ ఇచ్చినా అందులో ఏదో ఒక కొత్తదనం వెతుక్కుని మణి తన సినిమాలో పెట్టుకుంటాడని అన్నాడు. తన నుంచి రాబోయే ‘2.0’ సినిమాలో నేపథ్య సంగీతం చాలా కీలకమని.. అందులో చాలా ప్రయోగాలు చేశానని రెహమాన్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English