సాయిరెడ్డి ట‌చ్‌పై జేసీ పంచ్ పేలింది!

సాయిరెడ్డి ట‌చ్‌పై జేసీ పంచ్ పేలింది!

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి నిన్న ఓ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. టీడీపీలో ఉన్న కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని, ఏ క్ష‌ణాన్నైనా వారు వైసీపీలో చేరిపోతార‌ని ఆయ‌న పేర్కొన్నారు. విశాఖ‌లో ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ స్థానిక నేత‌లు నిర్వ‌హించిన ఆందోళ‌న కార్య‌క్రమానికి మ‌ద్ద‌తు తెలిపేందుకు వ‌చ్చిన సాయిరెడ్డి... ఆ ప‌ని మాత్ర‌మే చేసుకుని పోకుండా టీడీపీపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని, అధికారంలోకి రాగానే త‌మ‌ను ఇబ్బంది పెట్టిన వారి భ‌ర‌తం ప‌డ‌తామ‌ని, ఈ విష‌యంలో అధికారుల‌ను కూడా వ‌దిలిపెట్ట‌బోమ‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయినా ఎక్కడైనా విప‌క్ష పార్టీల్లో నుంచి అధికార పార్టీల్లోకి వ‌ల‌స‌లు జ‌రుగుతాయి గానీ... అధికార పార్టీ నుంచి విప‌క్షంలోకి వ‌ల‌స‌లు ఉంటాయా? ఇప్ప‌టిదాకా అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన దాఖ‌లా లేదు.

మ‌రి సాయిరెడ్డి ఈ మాటెందుకు చెప్పార‌న్న విష‌యంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. అధికార ప‌క్షాన్ని ఢీకొట్టే విష‌యంలో అడుగ‌డుగునా విఫ‌ల‌మ‌వుతున్న విప‌క్షం త‌న‌ను తాను బ‌ల‌వంతుడిగా చెప్పుకునే య‌త్నంలో భాగంగానే సాయిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ వాద‌న నిజ‌మేన‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పుంర ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి తేల్చి పారేశారు. నేటి ఉద‌యం అమరావ‌తిలో జ‌రిగిన టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి హాజరైన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ... సాయిరెడ్డి ట‌చ్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌ర్ పంచ్ సంధించారు. ఈ పంచ్ బాగానే పేలింది కూడా.

అయినా సాయిరెడ్డి కామెంట్ల‌పై జేసీ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. *నేను కూడా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో మాట్లాడతా. ‘బాగున్నారా విజయసాయిరెడ్డి గారు’ అని పలకరిస్తా.. ఎంపీలందరితోనూ మాట్లాడతా..వాళ్లతో కలిసి కాఫీ తాగుతా. యోగ క్షేమ సమాచారాల కోసం, కలిసి కాఫీ తాగడం కోసం వారితో టచ్ లో ఉంటాను. అలా అని చెప్పి..నేను వైసీపీలోకి వెళుతున్నానని ఎప్పడైనా చెప్పానా? కనబడితే నమస్కారం పెడతాం, ’ఏమన్నా బాగున్నావా?’ అని అడుగుతాం. అయినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టా? ఎమ్మెల్యేలు ఏమైనా తిక్కనాకొడుకులా..చాలా తెలివైన వాళ్లు! వైసీపీ లోకి టీడీపీ వాళ్లు వెళ్లి ఇప్పుడేం చేస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్లను జగన్ తీసుకుంటాడని తెలుసు. అర్హులు కాని వాళ్లకు, ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్లకు, అవినీతిపరులకు టికెట్లు ఇవ్వనని చంద్రబాబు నాయుడుగారు రోజూ చెబుతున్నారు. అప్పుడు, మాజీ ఎమ్మెల్యేలు కొందరు నీ (జగన్) దగ్గరకు వస్తారు నాయనా! వాళ్లకు టికెట్లు ఇవ్వు..ఎవరొద్దన్నారు?’ అని జేసీ తన దైనశైలిలో సాయిరెడ్డి కామెంట్ల‌పై ప‌వ‌ర్ పంచ్ లేశారు.  మాట్లాడారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English