బాలయ్య హీరోయిన్‌కి హాలీవుడ్ ఛాన్స్

బాలయ్య హీరోయిన్‌కి హాలీవుడ్ ఛాన్స్

‘రక్త చరిత్ర’.. ‘ధోని’.. ‘లెజెండ్’.. లాంటి దక్షిణాది సినిమాలతో కథానాయికగా పేరు తెచ్చుకుంది రాధికా ఆప్టే. ఐతే ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్లో మంచి మంచి అవకాశాలు రావడంతో అక్కడే సెటిలైపోయింది. ఈ మధ్య ‘కబాలి’ మినహాయిస్తే దక్షిణాదిన ఇంకే సినిమా చేయలేదు. ఇక్కడి జనాల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ బాలీవుడ్‌కే పరిమితం అయిపోయిన రాధిక.. అక్కడ కూడా తన అభిరుచికి తగ్గ వైవిధ్యమైన సినిమాల్లో మాత్రమే నటిస్తోంది.

తాజాగా ఆమెకు ఓ హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కడం విశేషం. హాలీవుడ్లో అనేక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన లిడియా డీన్ పిల్చెర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగుతుందట. ఇందులో లేడీ క్యారెక్టర్లు చాలా కీలకంగా ఉంటాయట. ఆ పాత్రల్లో స్టానా కాటిక్.. సారా మేగన్‌లతో పాటు రాధికా ఆప్టే కూడా నటించనుంది. ఈ చిత్రంలో రాధిక గూడఛారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఐశ్వర్యా రాయ్.. ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనే లాంటి టాప్ హీరోయిన్లు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు రాధిక కూడా అవకాశం అందుకుంది. ఆమె ఆల్రెడీ ఇంటర్నేషల్ లెవెల్లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదిస్తుందో చూడాలి. బాలీవుడ్లో ఆమె ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు