పవన్ ప్రసంగం ఖరీదెంత?

పవన్ ప్రసంగం ఖరీదెంత?

‘రంగస్థలం’ సినిమాను ప్రసాద్ ఐమాక్స్‌కు వచ్చి పవన్ కళ్యాణ్ వీక్షించడమే పెద్ద సంచలనం. పవన్ కెరీర్ ఆరంభం నుంచి అతను ఇలా వేరే సినిమాను ఇలా బయటి థియేటర్లో చూడటం.. దాని గురించి స్పందించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అలా సినిమా చూసి విలేకరులతో మాట్లాడటమే ఎక్కువ అనుకుంటే.. ఈ చిత్ర సక్సెస్ మీట్‌కు హాజరై కొన్ని గంటల పాటు ఉండటం.. ఏకంగా 25 నిమిషాల పాటు ప్రసంగించడం మరింత ఆశ్చర్యపరిచే విషయం. పవన్ తన సినిమాల్ని ప్రమోట్ చేయడానికే ఆసక్తి చూపించడు. అలాంటిది వేరే సినిమా కోసం అతను ఇంత సమయం కేటాయించడం అందరికీ విడ్డూరంగా అనిపిస్తోంది.

ఐతే పవన్ ఇలా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కారణాలు వేరే ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘రంగస్థలం’ చిత్ర నిర్మాతలతో ఓ సినిమా చేయడానికి పవన్ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడు. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత వాళ్లతో సినిమా మొదలుపెడతాడని కూడా ప్రచారం జరిగింది. కానీ పవన్ మాత్రం రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అతడి తీరు చూస్తుంటే మళ్లీ సినిమాల వైపు చూసేలా కనిపించట్లేదు. ఐతే పవన్ మైత్రీ వాళ్లకు అడ్వాన్స్ తిరిగిచ్చేశాడా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఐతే ఈ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ స్పెషల్ షోకు హాజరవడం.. విలేకరులతో పాజిటివ్‌గా మాట్లాడటం.. ఇప్పుడు సక్సెస్ మీట్‌కు హాజరై విపరీతంగా సినిమాను పొగిడేయడం.. దీన్ని ఆస్కార్‌కు పంపించాలనడం.. నిర్మాతల మీదా తెగ పొగడ్తలు కురిపించడం చూస్తుంటే జనాలకు లేనిపోని సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడున్న బిజీలో పవన్ పొలిటికల్ కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి సినిమా చూడటం.. సక్సెస్‌ మీట్‌కు హాజరవడం.. ఇంత విలువైన సమయాన్ని కేటాయించడం అంటే ఏదో మతలబు ఉందనే అంటున్నారు. పవన్ వ్యక్తిత్వం ప్రకారం చూతే ఎక్కడా సహజంగా స్పందించినట్లుగా అనిపించడం లేదు. వేరే ఉద్దేశంతోనే ఇలా చేశాడనిపిస్తోంది. మైత్రీ వాళ్ల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌కి ఇది చెల్లేమో అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రకంగా చూస్తే పవన్ ప్రసంగం చాలా ఖరీదైందనే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు