ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేశారబ్బా

ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేశారబ్బా

ఒక తమిళ దర్శకుడు.. తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులతో తీసిన సినిమా ముందు తమిళంలో కాక తెలుగులో రిలీజవడం అరుదైన విషయం. ‘మెర్క్యురీ’ సినిమా విషయంలో అదే జరిగింది. ఈ చిత్రం శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ఐతే ఈ చిత్రం ఇంకా తమిళంలో మాత్రం విడుదల కాలేదు. అందుక్కారణం తమిళనాట సమ్మె కారణంగా నెలన్నరగా సినిమాల ప్రదర్శన ఆగిపోవడమే. ఐతే ముందు తమిళంలో విడుదల కాకుండా ఇంత అవసరంగా తెలుగులో ఈ చిత్రాన్ని ఎందుకు రిలీజ్ చేశారన్నది అర్థం కాని విషయం. పోనీ తెలుగులో అయినా ఈ చిత్రానికి సరైన బజ్ తీసుకు రాగలిగారా అంటే అదీ లేదు.

ప్రభుదేవా మినహా ఇందులో తెలిసిన ముఖాలేవీ లేవు. ఒక వైవిధ్యమైన కథతో.. మాటల్లేని సైలెంట్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్. ఐతే రెండు వారాల ముందు నుంచే ఇక్కడ కొంచెం హడావుడి చేసి.. ఈ కాన్సెప్ట్ సంగతి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సింది. అలాంటిదేమీ చేయలేదు. ఈ సినిమాను రిలీజ్ చేసిన టైమింగ్ కూడా రాంగే. ‘రంగస్థలం’ ప్రభంజనం కొనసాగుతున్నపుడు.. నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’కు పోటీగా రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజైన సంగతే జనాలకు తెలియలేదు. పైగా సినిమా చూసిన జనాలు భిన్న రకాలుగా మాట్లాడుతున్నారు. తెలుగు నుంచి ఈ చిత్రానికి పెద్దగా ఆదాయమేమీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇది జనాల్లోకే వెళ్లలేదసలు. ఐతే ముందు తమిళంలో రిలీజై ఉంటే దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడిచేది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేదేమో. అసలు తెలుగు నుంచి ఆదాయం వచ్చు అవకాశం లేకపోయినా.. తమిళంలో విడుదల కాకుండానే ఇక్కడ ఇలా నామమాత్రంగా ఎందుకు రిలీజ్ చేశారన్నది అర్థం కాని విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు