చిరంజీవికి రెండు కోట్ల దూరంలో చరణ్

చిరంజీవికి రెండు కోట్ల దూరంలో చరణ్

‘రంగస్థలం’ నాన్-బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకోవడం లాంఛనమే కావచ్చు. తొలి వీకెండ్లో ఎంత భారీ వసూళ్లు సాధించిన సినిమా అయినా.. ఆ తర్వాత జోరు తగ్గించడం మామూలే. కానీ ఈ చిత్రం వీకెండ్ తర్వాత కూడా అదరగొట్టింది. రెండో వీకెండ్లో అనూహ్యమైన వసూళ్లు సాధించింది.

రెండో సోమవారం కూడా రూ.2 కోట్ల షేర్‌తో ఆశ్చర్యపరిచింది. ఇక ఈ వీకెండ్లో కూడా ఆ సినిమా జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ‘రంగస్థలం’ ఆల్రెడీ రూ.100 కోట్ల షేర్ మార్కును కూడా దాటేసింది. రెండు వారాల్లో ఈ చిత్రం రూ.103 కోట్ల షేర్ సాధించడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లు లాభాల బాట పట్టారు. కొన్ని చోట్ల బయ్యర్లు 50 శాతం లాభాలు అందుకునే పరిస్థితి కనిపిస్తోంది.

‘మగధీర’.. ‘అత్తారింటికి దారేది’.. ‘జనతా గ్యారేజ్’.. ‘శ్రీమంతుడు’.. ఇలా వసూళ్లలో ఒక్కో సినిమాను దాటుకుంటూ వస్తున్న ‘రంగస్థలం’.. 100 కోట్ల మైలురాయిని కూడా దాటేసి మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’ రికార్డుపై కన్నేసింది. గత సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రం రూ.105 కోట్ల షేర్‌తో నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పింది.

ఆ రికార్డుకు ఇంకో రెండు కోట్ల దూరంలో ఉంది ‘రంగస్థలం’. వీకెండ్ అవ్వకముందే రికార్డు బద్దలు కావడం... తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ పేరు తెచ్చుకోవడం లాంఛనమే అన్నమాట. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.110 కోట్ల మార్కును కూడా దాటేస్తుందేమో. కాబట్టి మహేష్ మూవీ ‘భరత్ అనే నేను’కు టార్గెట్ పెద్దదే ఉండబోతున్నదన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు