కావేరీ వివాదంపై శింబు డేరింగ్ కామెంట్స్

 కావేరీ వివాదంపై శింబు డేరింగ్ కామెంట్స్


కావేరీ జలాలకు సంబంధించిన వివాదం ఇప్పుడు తమిళనాడును కుదిపేస్తోంది. ఈ గొడవ వల్లే చెన్నై నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా పుణెకు తరలిపోయాయి. ఇటు రాజకీయ పక్షాలు.. అటు సినీ వర్గాలు ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. అందరూ కలిసి కర్ణాటక మీద తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రజినీకాంత్, కమల్ హాసన్ సైతం కర్ణాటక తీరును తప్పుబడుతున్నారు. ఐతే రాజకీయాల్లో మార్పు తెస్తామని అంటున్న రజినీ, కమల్ కూడా సగటు రాజకీయ నాయకుల్లాగే స్పందిస్తున్నారని.. సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం దారుణమని కన్నడిగులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి తరుణంలో స్టార్ హీరో శింబు చేసిన వ్యాఖ్యలు సంచనలం రేపుతున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అతను కన్నడిగులకు మద్దతుగా మాట్లాడాడు. కన్నడిగులు శత్రువులు కారని.. వాళ్లకూ మంచి జరగాలని.. కావేరీ జలాలు తమిళనాడుకు ఎంత రావాలో.. కర్ణాటకకు కూడా అంతే రావాలని శింబు అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల జనాల మధ్య అంతరాలు పెంచవద్దని అతను కోరాడు. కన్నడిగులు మన శత్రువులు కారని.. వారితో ప్రేమగా ఉందామని అతను పిలుపునిచ్చాడు. శింబు వ్యాఖ్యలపై కన్నడిగుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌తో పాటు పలువురు అతడిపై ప్రశంసలు కురిపించారు. తమిళనాట కూడా అతడికి మద్దతు లభించింది. శింబు చాలా పరిణతితో వ్యవహరించాడని.. వ్యవహారం చాలా సున్నితంగా మారిన సమయంలో అతను భావోద్వేగాల్ని రెచ్చగొట్టకుండా ఇలా మాట్లాడటం గొప్ప విషయమని పొగడ్తలు గుప్పిస్తున్నారు. తన వ్యాఖ్యలపై జనాలు ఇలా స్పందిస్తున్నందుకు శింబు కన్నడిగులకు, తమిళులకు ధన్యవాదాలు చెబుతూ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు