అఫీషియల్: రజినీ డేటుకి విష్ణు

అఫీషియల్: రజినీ డేటుకి విష్ణు

మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది. ఎప్పటికప్పుడు కొత్త డేట్‌తో పోస్టర్ వేయడం.. మళ్లీ వాయిదా సంగతి బయటికి రావడం.. ఇలా నడుస్తోంది యవ్వారం. చివరగా ఏప్రిల్ 6కు అనుకున్న ఈ చిత్రం ఆ రోజు కూడా విడుదల కాలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 27 అంటూ కొత్త డేట్ వినిపించింది. ఇప్పుడు అదే తేదీని అధికారికంగా ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్ వదిలారు.

ఏప్రిల్ 27న సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘కాలా’ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తమిళనాట అనూహ్యంగా సినీ నిర్మాతల సమ్మె మొదలవడంతో ఆ చిత్రం ఆ తేదీకి రావడం దాదాపు అసాధ్యమని అంటున్నారు. దీంతో ఆ తేదీని మంచు విష్ణు వాడేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ కోలీవుడ్లో పరిస్థితులు మారి ‘కాలా’ ఏప్రిల్ 27కే వచ్చేట్లుంటే మాత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’ మళ్లీ వాయిదా పడుతుందేమో.

ఇంతకుముందు మంచు విష్ణుతో ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి హిట్ సినిమాలు తీసిన జి.నాగేశ్వరరెడ్డి రూపొందించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. సీనియర్ ప్రొడ్యూసర్ ఎం.ఎల్.కుమార్ చౌదరి చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ సినిమాతో ప్రొడక్షన్లోకి పునరాగమనం చేశాడు. విష్ణు సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించాడు. విష్ణు-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల్లాగే ఇది కూడా కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు