ఈగ కోసం అంత త్యాగం చేసిందట

ఈగ కోసం అంత త్యాగం చేసిందట

ఒక పెద్ద సినిమాలో ప్రాధాన్యం లేని పాత్ర.. పారితోషకం ఎక్కువ ఇస్తారు. మరో చిన్న సినిమాలో ప్రత్యేకమైన పాత్ర.. పారితోషకం నామమాత్రం. ఈ రెండు అవకాశాలు తన ముందు ఉంటే రెండో దానికే ఓటేస్తానని అంటోంది అక్కినేని సమంత. ఊరికే మాటలు చెప్పడం కాదు.. తాను నిజంగా ఇలా చేశానని.. అది కూడా కెరీర్ తొలి దశలోనే అని ఆమె వెల్లడించింది. ఆమె అలా ఎంచుకున్న సినిమా ‘ఈగ’ అట. ఇది చిన్న సినిమా ఏంటని అనిపించొచ్చు. ఐతే మొదలయ్యేటపుడు ఇది చిన్న సినిమాగానే మొదలైందని.. ఆ తర్వాత అనుకోకుండా పెద్ద స్థాయికి వెళ్లిందని.. ఈ సినిమా కోసం తాను పెద్ద త్యాగమే చేశానని సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘ఈగ’ సినిమా కోసం తనను అడిగినపుడు కాల్షీట్లు ఎక్కువ కావాలని.. ఐతే పారితోషకం విషయంలో ఎక్కువగా ఆశించకండి అని ఆ చిత్ర బృందం స్పష్టం చేసిందని.. ఐతే అదే సమయంలో తనకు రెండు పెద్ద సినిమాల్లో నటించే అవకాశం లభించిందని సమంత చెప్పింది. ఆ రెండు సినిమాలకూ కళ్లు చెదిరే పారితోషకం ఇస్తామని అన్నారని.. ఐతే వాటిని కాదని తాను ‘ఈగ’లో నటించడానికే మొగ్గు చూపానని.. నిజానికి అది పెద్ద రిస్క్ అని.. ‘ఈగ’ అనుకున్నట్లుగా ఆడకపోయి ఉంటే తన టైం, డబ్బు రెండూ వృథా అయ్యేవని సమంత అంది. ఐతే ‘ఈగ’తో తనకు చాలా మంచి గుర్తింపు వచ్చిందని.. దాని వల్ల మరిన్ని మంచి అవకాశాలు వచ్చాయని.. కెరీర్లో ఏది మనకు ప్లస్ అవుతుందో.. ఏది మైనస్ అవుతుందో చెప్పలేమని.. ఈ ఎంపికే మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు