కొడుకు కోసం మాత్రమేనా పూరీ?

కొడుకు కోసం మాత్రమేనా పూరీ?

ఒక దర్శకుడి మీద ఒకసారి గురి కుదిరితే.. అభిమానం కలిగితే అది అంత సులువుగా పోదు. వాళ్లు ఎన్ని ఫ్లాపులు తీసినా మళ్లీ వాళ్ల తర్వాతి సినిమా వైపు ఆశగా చూస్తారు అభిమానులు. రామ్ గోపాల్ వర్మ.. ఆయన శిష్యుడు పూరి జగన్నాథ్ ఆ తరహా డైహార్డ్ ఫ్యాన్స్ ను పెద్ద సంఖ్యలోనే సంపాదించుకున్నారు. కానీ వీళ్లిద్దరూ గత దశాబ్ద కాలంలో తమ సినిమాలతో అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేశారు. ముఖ్యంగా పూరి గత పదేళ్లలో తీసిన మంచి సినిమా ఒక్క ‘టెంపర్’ మాత్రమే. అది కూడా పూరి సొంత కథతో తీసిన సినిమా కాదు. దాని తర్వాత పూరి తీసిన ఐదు సినిమాలూ డిజాస్టర్లే అయ్యాయి. చివరగా నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం వస్తే దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు.

‘పైసా వసూల్’ చూశాక పూరి మీద వీరాభిమానులకు సైతం పూర్తిగా నమ్మకం పోయింది. ఈ స్థితిలో బాలయ్య లాంటి పెద్ద హీరో అవకాశమిస్తే ఇలాంటి సినిమా తీశాడంటే పూరిలో విషయం పూర్తిగా అడుగంటిందనే అనుకున్నారు. తన కొడుకు పూరి ఆకాశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ అనే సినిమా అనౌన్స్ చేస్తే..దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ చిత్ర టీజర్ చూశాక జనాల ఆలోచనలు మారాయి. ఇప్పుడు ట్రైలర్ చూసి అందరూ మరింతగా షాకయ్యారు. పూరి ఈజ్ బ్యాక్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

గత పదేళ్లలో తీసిన సినిమాలే తీస్తూ.. తన కథల్ని ప్రతిసారీ మాఫియా చుట్టూ తిప్పుతూ ప్రేక్షకులకు మొహం మొత్తేలా చేసిన  పూరి.. ఈసారి మాత్రం పూర్తి భిన్నమైన బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు. ఇండియన్ సోల్జర్.. పాకిస్థాన్ అమ్మాయి మధ్య సరిహద్దు ప్రేమ కథను ఎంచుకుని దాన్ని మంచి ఇంటెన్సిటీతో నడిపించినట్లు కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూశాక పూరి కొడుకును పరిచయం చేసే సినిమా మీద మాత్రం ఎంత శ్రద్ధ పెట్టాడో.. ఎంత వైవిధ్యమైన సినిమా తీశాడో.. ఈ శ్రద్ధ.. ఈ వైవిధ్యం మిగతా హీరోల విషయంలో కనిపించలేదే అని చర్చించుకుంటున్నారు. ఈ తరహాలో అప్పుడప్పుడూ అయినా ఒక వైవిధ్యమైన సినిమా తీసి ఉంటే పూరి ఇమేజ్ ఈ స్థాయిలో డ్యామేజ్ అయ్యేది కాదు. మరి ‘మోహబూబా’ తర్వాత పూరి ఎవరితో సినిమా చేస్తాడు.. అప్పుడు ఏమాత్రం వైవిధ్యం చూపిస్తాడు అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు