కామెంట్: టాలీవుడ్ టైం బాలేదంతే!!

కామెంట్: టాలీవుడ్ టైం బాలేదంతే!!

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఇప్పుడు అస్స‌లు టైం బాగున్న‌ట్టు లేదు. భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌య్యే సినిమాలు బాక్సీఫీసు ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌డం వంటి స‌మ‌స్య‌లు... చాలా రోటీన్‌. ఎప్పుడూ ఉండేవే! కానీ ఇప్పుడు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి కొత్త కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చి టాలీవుడ్ ప‌రువు తీస్తున్నాయి. గ‌త ఏడాది నుంచి మొద‌లైన ఈ స‌మ‌స్య‌ల చదరంగం.. ఇప్పుడు ఫుట్ బాల్ తరహాలో తయారైంది.

గ‌త ఏడాది ద్వితియార్థంలో డ్ర‌గ్స్ స్కాండిల్ టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపింది. ర‌వితేజ‌- పూరీ జ‌గ‌న్నాథ్‌- ఛార్మి వంటి స్టార్లు కూడా డ్ర‌గ్స్ స్కాండిల్ లో ఇరుక్కోవ‌డంతో రెండు నెల‌ల పాటు మీడియా మొత్తం ఈ విష‌య‌మే హాట్ టాపిక్ అయ్యింది. తరువాత ఒక సినిమా కి్రటిక్ వర్సెస్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ అంటూ నానా రచ్చా చేశారు. కోడిగుడ్లతో కొట్టడం నుండి.. అక్రమ సంబంధాలు అంటగట్టడం వరకు ఆ చెత్తను మనోళ్లు చెత్తచెత్తగా ఎంకరేజ్ చేశారు. త‌ర్వాత ఎలాగో ఈ గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది అనేలోపు... వీపీఎఫ్ చార్జి గురించి గొడ‌వ‌. డిజిట‌ల్ ఆప‌రేటర్లు అక్ర‌మంగా వ‌సూలు చేస్తున్న వీపీఎఫ్ చార్జిని త‌గ్గించాల‌ని నిర్ణ‌యించింది ద‌క్షిణాది నిర్మాతల మండ‌లి. మార్చి 2 నుంచి ద‌క్షిణాది రాష్ట్రాల్లోని థియేట‌ర్ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. దాదాపు వారం రోజుల పాటు సినీ ప్రేమికుల‌కు థియేట‌ర్లో బొమ్మ చూసే భాగ్యం ద‌క్క‌లేదు. త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ స‌ద్దుమ‌ణిగి థియేట‌ర్లు తెరుచుకున్నాయి.

అంతా ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటున్న త‌రుణంలో ఉప్పెన‌లా వ‌చ్చింది శ్రీ‌రెడ్డి. ప‌డుకుంటేగానీ ప‌న‌వ‌దంటూ... ప‌చ్చి ప‌చ్చిగా  బూతులు మాట్లాడి టాలీవుడ్ ప‌రువు తీసేసింది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ... ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయింది. అస‌లు ఈ ఇంట‌ర్వ్య‌కి ముందు శ్రీ‌రెడ్డి అనే అమ్మాయి సినిమాల్లో న‌టించ‌ద‌నే విష‌యం కూడా చాలామందికి తెలియ‌క‌పోవ‌డం విశేషం. శ్రీ‌రెడ్డి ఇష్యూ  కొన్ని వారాలుగా సాగుతూనే ఉంది.

ఇక సదరు విష‌యంపై డిబెట్ ఏర్పాటుచేసిన ఓ టీవీ ఛాన‌ల్ యాంక‌ర్‌... తెలుగు న‌టుల‌ను బూతులు తిట్ట‌డం మ‌రో వివాదానికి దారి తీసింది. టాలీవుడ్ న‌టీమ‌ణులంతా అత‌న్ని బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చేప్పాల‌ని డిమాండ్ చేస్తూ బ‌య‌టికొచ్చారు. శ్రీ‌రెడ్డి గొడ‌వ కొన‌సాగుతుండ‌గానే మ‌రో తెలుగు హీరోయిన్ మాధ‌వీల‌త కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేసింది. ఏడాది క్రిత‌మే ఈ వ్యాఖ్య‌లు చేసినా... అప్పుడు పాపుల‌ర్ కాక‌పోవ‌డంతో శ్రీ‌రెడ్డి ఇష్యూ త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చి... నానా ర‌చ్చ చేస్తోంది మాధ‌వీల‌త‌. అంతేకాకుండా ఇలియానా- రాధికా ఆప్టే వంటి స్టార్లు ద‌క్షిణాది సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాధికా ఆప్టే అయితే ఏకంగా సౌత్ హీరోను మందలించేశా మట్టీ మశానం అంటూ కామెంట్ చేసింది.

తెలుగు హీరోయిన్లు మాధ‌వీల‌త‌- శ్రీ‌రెడ్డి ఇష్యూల‌పై ఎలా స్పందించాలో మా అసోషియేష‌న్ కు అర్థం కావ‌ట్లేదు. దాంతో శ్రీ‌రెడ్డి నిజ‌స్వ‌రూపం ఇదంటూ ఏవేవో మాట్లాడుతూ అస‌లు స‌మ‌స్య‌పై మాత్రం స్పందించ‌డం లేదు. దీంతో ఇప్ప‌టికే టాలీవుడ్ ప‌రువు బ‌జారున ప‌డింది. దేశ‌వ్యాప్తంగా ఇక్క‌డి కాస్టింగ్ కౌచ్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఇన్ని స‌మ‌స్య‌ల నుంచి టాలీవుడ్ ఎప్పుడు బ‌య‌ట‌ప‌డుతుందో అర్థం కాని ప‌రిస్థితి.

ఒక్క ప‌క్క రంగ‌స్థ‌లం సినిమా ఇండ‌స్ట్రీ హిట్టు కొట్టింది. బ‌య్య‌ర్లు... డిస్టిబ్యూట‌ర్ల‌కు మంచి లాభాలు వ‌స్తున్నాయి. అయినా ఆ ఆనందం చిత్ర ప‌రిశ్ర‌మలో క‌నిపించ‌డం లేదు. కార‌ణం స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో చిక్కుకోవ‌డ‌మే. టైం బాలేదు అనుకోవడమే. అంతకంటే ఏం చేస్తాం. ఎక్కువ మాట్లాడితే మళ్లీ.. మీరు శ్రీరెడ్డి తరుపా? మీడియా తరుపా? బూతులు తిట్టిన యాంకర్ తరుపా? మహిళా పక్షపాతా? మహిళా వ్యతిరేకా? ఆ ప్రొడ్యూసర్ కొడుకు తరుపా? పెద్ద హీరో తరుపా? అంటూ ఎవరో ఒకరి పక్కన మనల్ని కూర్చోబెట్టేసి.. వీరు రాక్షసానందం పొందేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు