నానా ఎన్టీఆర్.. ఏంటి సంగతి?

నానా ఎన్టీఆర్.. ఏంటి సంగతి?

తెలుగు స్టార్ హీరోలకు అభిమానులతో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఉంటారు. మెగా హీరోలంటే నందమూరి అభిమానులకు పడదు. నందమూరి హీరోలంటే మెగా అభిమానులకు పడదు. అలాగే మహేష్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌ను వ్యతిరేకిస్తారు. పవన్ ఫ్యాన్స్ మహేష్ మీద విరుచుకుపడుతుంటారు. వాస్తవంగా చెప్పాలంటే తెలుగులో నందమూరి హీరోలకే యాంటీ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటారు. ఆ ఫ్యామిలీ హీరోలకు మిగతా ఫ్యామిలీలతో అంత మంచి సంబంధాలున్నట్లుగా కనిపించదు.

వాళ్ల అభిమానులు కూడా ఒక పరిధిలోనే ఉంటారని.. వేరే వాళ్లంటే అస్సలు పడదనే అభిప్రాయం ఉంది. బాలయ్య మార్కెట్ ఒక స్థాయి మించి పెరగకపోవడానికి ఇదే కారణం అంటారు. ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. అతను కేవలం నందమూరి అభిమానుల్లో కొంతమేర మాస్‌లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కానీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను, అభిమానులను చేరుకోలేకపోయాడు.

కానీ గత కొన్నేళ్లలో క్లాస్ టచ్ ఉన్న, వైవిధ్యమైన సినిమాలు చేయడం ద్వారా ఎన్టీఆర్ తన కెరీర్‌ను మార్చుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల్లోకీ చొచ్చుకుపోయాడు. దీంతో అతడి మార్కెట్ మూడేళ్ల వ్యవధిలో రెట్టింపైంది. అదే సమయంలో అతను యాంటీ ఫ్యాన్స్‌లో వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం కూడా గట్టిగానే చేస్తున్నాడు. ఆ మధ్య రామ్‌చరణ్‌తో కలిసి ఫొటో దిగాడు. ఆపై అతడితో సినిమాను ఓకే చేశాడు. అలా మెగా అభిమానుల నుంచి వ్యతిరేకత తగ్గించున్నాడు. ఇక ఈ మధ్యే తన సినిమాకు పవన్ కళ్యాణ్‌ను అతిథిగా పిలిచి.. అతడితో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా పవర్ స్టార్ డైహార్డ్ అభిమానుల్లోనూ వ్యతిరేకత పోగొట్టుకున్నాడు.

ఇప్పుడు మహేష్ సినిమా ‘భరత్ అనే నేను’కు ముఖ్య అతిథిగా వెళ్లడం ద్వారా అతడి అభిమానుల్లోనూ సానుకూలత తెచ్చుకున్నాడు. ఇలా దాదాపుగా యాంటీ ఫ్యాన్స్ అందరిలోనూ వ్యతిరేకత తగ్గించుకున్నాడు. బాలయ్యకు దూరం జరగడం వల్ల కొంత మేర నందమూరి అభిమానుల్ని దూరం చేసుకుని ఉండొచ్చు కానీ.. అతడికంటూ సొంతంగా భారీ ఫాలోయింగే ఉంది. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్‌ను తగ్గించుకోవడం ద్వారా బలం మరింత పెంచుకున్నాడు. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తు దిశగా తారక్ భారీ ప్రణాళికలతో ఉన్నాడని అనిపించట్లేదూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు