సాహో కోసం నాలుగు కంటైనర్లు వెళ్లాయట

సాహో కోసం నాలుగు కంటైనర్లు వెళ్లాయట

చిత్రీకరణ దశలో ఉన్న కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా సంగతులు బయటికి వస్తే జనాల్లో భలే ఆసక్తి ఉంటుంది. అందులోనూ దేశమంతా ఎదురు చూస్తున్న సినిమా సంగతులు మరింత ఆసక్తి రేకెత్తిస్తాయి. ‘సాహో’ సినిమా ఆ కోవలోకే వస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాల్ని మీడియాతో పంచుకున్నాడు లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్.

‘బాహుబలి’ సిరీస్ తర్వాత సాబు పని చేస్తున్న మెగా ప్రాజెక్టు ‘సాహో’నే. ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలుంటాయని ముందు నుంచి చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా రెండు నెలల పాటు ఆ సన్నివేశాలు చిత్రీకరించడానికి చాన్నాళ్లుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఏప్రిల్ 12 నుంచి ఈ షెడ్యూల్ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో సాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

ఈ షెడ్యూల్ కోసమే సాబు సిరిల్ గత ఆరు నెలల వ్యవధిలో ఎనిమిది సార్లు దుబాయికి వెళ్లి వచ్చాడట. దీని కోసం గత నెలన్నర రోజులుగా తన టీం రేయింబవళ్లు శ్రమిస్తోందని చెప్పాడాయన. ‘‘నా టీంలోని 300 మంది పెయింటర్లు, మౌల్డర్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, డిజైనర్లతో కలిసి నెలన్నర కిందట దుబాయికి వెళ్లాను. ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోయే సన్నివేశాల కోసం చాలా పరిశోధన చేశాం. ఎంతో మెటీరియల్ సేకరించాం. ఆ మొత్తం మెటీరియల్ నాలుగు కంటైనర్లయింది. ఆ కంటైనర్లు దుబాయికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం అక్కడ మేం తీసుకెళ్లిన మెటీరియల్‌ను ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. నేను నా కెరీర్లో అత్యంత శ్రమకు ఓర్చి పని చేస్తున్న సినిమాల్లో ఇది ఒకటి’’ అని సాబు తెలిపాడు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ‘సాహో’ దుబాయ్‌లో భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇప్పటికే చిత్ర బృందమంతా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు