మళ్లీ ప్రభుదేవాతో నయన్?

మళ్లీ ప్రభుదేవాతో నయన్?

నయనతార ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటుందో తెలిసిందే. ఒకప్పుడు శింబుతో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత అతడితో గొడవ పడి విడిపోయిన నయన్.. కొన్నేళ్ల తర్వాత విభేదాలన్నీ పక్కన పెట్టి శింబుతో ఓ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ చిత్రమే తెలుగులో ‘సరసుడు’ పేరుతో విడుదలైంది.

ఇదే కోవలో ఇప్పుడు ప్రభుదేవాతోనూ మళ్లీ కలిసి పని చేయడానికి ఆమె సిద్ధమైనట్లుగా వార్తలొస్తున్నాయి కోలీవుడ్లో. శింబు నుంచి విడిపోయాక ప్రభుదేవాకు బాగా దగ్గరైంది నయన్. వీళ్లిద్దరూ ఒక దశలో సహజీవనం కూడా చేసినట్లుగా గుసగుసలు వినిపించాయి. ప్రభు కోసం మతం మారడమే కాదు.. పెళ్లికి కూడా సిద్ధపడింది నయన్. ఇందుకోసం సినిమాలకు కూడా టాటా చెప్పడానికి సిద్ధమైంది.

కానీ ఏమైందో ఏమో ఇద్దరూ విడిపోయారు. నయన్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఒక దశలో శింబునైనా క్షమిస్తా కానీ.. ప్రభును మాత్రం మన్నించలేనన్నట్లుగా మాట్లాడింది నయన్. అతడి పేరెత్తడానికి కూడా ఇష్టపడలేదామె. గత ఏడాది తమిళంలో నయన్ చేసిన ఓ సినిమాలో ప్రభుదేవాను హీరోగా తీసుకుందామంటే నయన్ అంగీకరించలేదని వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు నయన్ మనసు మారినట్లే ఉంది. ప్రభుదేవా దర్శకత్వంలో నటించడానికి ఆమె ఓకే చెప్పినట్లుగా కోలీవుడ్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

కొన్నాళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ప్రభు.. తిరిగి మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే తమిళంలో అజిత్ కథానాయకుడిగా సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చాడట. ఈ చిత్రానికి నయనతారను కథానాయికగా ఓకే చేశారని.. ఆమె గతాన్నంతా పక్కన పెట్టి ప్రభుదేవా దర్శకత్వంలో నటించడానికి సరే అందని వార్తలొస్తున్నాయి. ఇంతకుముందు ప్రభుదేవా దర్శకత్వంలో నయన్ ‘విల్లు’ అనే సినిమాలో నటిస్తున్నపుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

ప్రస్తుతం నయన్.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో డీప్ లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే నయన్ ఎంత ప్రొఫెషనల్ అయినప్పటికీ.. విఘ్నేష్‌తో పెళ్లికి సిద్ధపడుతూ మాజీ ప్రేమికుడితో సినిమా చేయడానికి అంగీకరించిందంటే ఆశ్చర్యపోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు