బన్నీ నోట ‘భరత్ అనే నేను’ మాట

బన్నీ నోట ‘భరత్ అనే నేను’ మాట

ఈ సమ్మర్ సీజన్లో ప్రధానంగా అందరి దృష్టీ ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’.. ‘నా పేరు సూర్య’ సినిమాల మీదే నిలిచింది. ఇందులో ముందుగా ‘రంగస్థలం’ విడుదలైంది. ఇక తర్వాత అందరి దృష్టీ మిగతా రెండు పెద్ద సినిమాల మీదే ఉంది. రెండు వారాల వ్యవధిలో రాబోతున్న ఈ చిత్రాల మధ్య పోటీ కూడా ఉంది.

పైగా ఇద్దరూ వేర్వేరు కుటుంబాలకు చెందిన హీరోలు. అందులోనూ ఒక టైంలో ఒకే రిలీజ్ డేట్ కోసం ఈ రెండు చిత్రాల వర్గాల మధ్య వార్ నడిచింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా ‘భరత్ అనే నేను’ గురించి అల్లు అర్జున్ స్పందించడం.. చాలా పాజిటివ్‌గా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా పెద్ద హీరోలు ప్రయోగాలు చేయడానికి భయపడుతున్నారు కదా అని బన్నీని ప్రశ్నిస్తే.. ‘రంగస్థలం’ ఆ హద్దుల్ని.. భయాల్ని చెరిపేసిందని బన్నీ అన్నాడు. దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ.. ‘‘మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ కచ్చితంగా కొత్త సినిమానే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి కథని ఒక స్టార్ హీరో చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ వేసవికి వచ్చే చిత్రాలన్నీ అటు కొత్తదనం.. ఇటు వైవిధ్యం రెండూ మేళవించినట్లే ఉన్నాయి. ఇది గొప్ప శుభసూచకం’’ అని బన్నీ అన్నాడు.

ఇక ‘రంగస్థలం’ గురించి బన్నీ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చిత్రాలు పెద్ద హీరోలకు ఉత్సాహాన్నిస్తాయి. తమిళ సినిమాల్లో ‘రా’ ఫ్లేవర్ ఉంటుంది. అలాంటి సినిమాలు తెలుగులో తీస్తే చూడరన్నది చాలామంది అభిప్రాయం. ఐతే తీయాల్సిన పద్ధతిలో తీస్తే చూస్తారని నేను వాదించేవాడిని. నా మాటను ‘రంగస్థలం’ నిజం చేసింది’’ అన్నాడు. చరణ్ ‘మగధీర’ తర్వాత ఆ స్థాయి నటన ‘రంగస్థలం’లో చూపించాడని.. అతను తప్ప ఇంకెవరూ ఆ పాత్రను అంత బాగా చేయలేరని బన్నీ కితాబివ్వడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English