ఎన్టీఆర్.. నిన్ను కొట్టేవాడు లేడబ్బా

ఎన్టీఆర్.. నిన్ను కొట్టేవాడు లేడబ్బా

నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలోనే తనేంటో రుజువు చేసుకున్నాడు. గత కొన్నేళ్లలో చాలా వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా మరిన్ని మెట్లు ఎక్కాడు. ఐతే నటుడిగా ఏ స్థాయిలో మెప్పిస్తున్నడో ఒక వేదిక మీద మాట్లాడే విషయంలో మరింతగా ఆకట్టుకుంటున్నాడు తారక్.

నటుడిగా అయినా అతడికి పోటీ ఇచ్చేవాళ్లు ఉంటారేమో కానీ.. ఒక వేదిక మీద మాట్లాడే విషయంలో మాత్రం ఎన్టీఆర్‌కు దీటైన మరో హీరో లేడంటే అతిశయోక్తి కాదు. ఇందుకు తాజా రుజువు ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతడి ప్రసంగం. ఏడు నిమిషాల అతడి ప్రసంగంలో ఒక్క వృథా మాట లేదు. ఎక్కడా బోరింగ్‌గా ఒక్క మాట మాట్లాడింది లేదు. చక్కటి భాష.. ప్రతి మాటలోనూ స్పష్టత.. పరిణతి.. ఆకర్షణ.. ప్రతి ఒక్కరినీ మెప్పించే వాక్చాతుర్యం.. ఇలా ఎన్నో మంచి లక్షణాలున్నాయి ఎన్టీఆర్ ప్రసంగంలో.

ఎక్కడా ఒక్క మాట తూలకుండా.. ఎవరినీ నొప్పించకుండా.. అంత పెద్ద వేదిక మీద అనర్గళంగా.. అద్భుతంగా మాట్లాడాడు తారక్. ఇటు తన అభిమానుల ఇగో దెబ్బ తినకుండా.. అటు మహేష్ గౌరవాన్ని పెంచుతూ అతను మాట్లాడిన ప్రతి మాటా ఆణిముత్యమే. అందులో ఎక్కడా అతిశయోక్తులు లేకపోవడం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒక కమర్షియల్ హీరోగా మహేష్ చేసినన్ని ప్రయోగాలు ఇంకెవరూ చేయలేదన్న విషయం చాలా మంది గుర్తించి ఉండరు.

కానీ ఎన్టీఆర్ ఆ విషయాన్ని నొక్క వక్కాణిస్తూ.. ఈ విషయంలో తన లాంటి హీరోలకు అతను ఇన్‌స్పిరేషన్ అన్నాడు. ‘జనతా గ్యారేజ్’లోని డైలాగ్ గుర్తు చేస్తూ మహేష్‌ను అరుదైన రకంగా అభివర్ణించాడు. తన ప్రసంగం ఆద్యంతం మహేష్‌ను అన్న అని సంబోధించడం కావచ్చు.. ఈ వేడుకకు తాను ముఖ్య అతిథిని కాదు.. మహేష్ కుటుంబ సభ్యుడిగా వచ్చాననడం కావచ్చు.. చివర్లో ముఖ్య అతిథి మహేష్ మాట్లాడాలని అనడం కావచ్చు.. ఇలా ప్రతి మాటతోనూ కట్టిపడేశాడు తారక్. మొత్తానికి వేదికెక్కి మాట్లాడాలంటే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని ఒప్పుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు