మహేష్ చెప్పిన ఐదారుగురు ఎవరబ్బా?

మహేష్ చెప్పిన ఐదారుగురు ఎవరబ్బా?

తిప్పి కొడితే తెలుగు సినీ పరిశ్రమలో ఐదారుగురు పెద్ద హీరోలుంటాం అంటూ ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమే అయ్యాయి. ఇంతకీ ఎవరా ఐదారుగురు అనే ప్రశ్న జనాల్లో మొదలైంది. మహేష్ తన తరం నుంచి లెక్కబెడుతున్నాడని అనుకుంటే.. చిరంజీవి తరం సీనియర్ స్టార్లను వదిలేయాల్సి ఉంటుంది. వేదిక మీద మహేష్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి.. ఇద్దరు అయిపోయారు. ఇక ఫాలోయింగ్.. మార్కెట్ విషయంలో మహేష్ కు దీటైన హీరో పవర్ స్టార్ పవన్​​ కళ్యాణ్ కాబట్టి ఆయన్ని మూడో పెద్ద హీరో అనుకుందాం.

ఇక పవన్-మహేష్ తర్వాత ఆ స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న కథానాయకుడు అల్లు అర్జున్. అతడు నాలుగోవాడన్నమాట. ఇక మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్‌ ను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అతడి నంబర్ ఐదు అనుకుంటే.. మిగిలిన వాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నమాట. మహేష్ ఈ ఆరుగురిని మాత్రమే లెక్కలోకి తీసుకుని ఐదారుగురు అన్నట్లున్నాడు. మెగాస్టార్ తరం హీరోల జోలికి అతను వెళ్లినట్లు లేడు.

నిజానికి ఫ్యాన్ వార్స్ గురించి ప్రస్తావించే క్రమంలో మహేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐతే చిరు-బాలయ్య-నాగార్జున-వెంకటేష్ అభిమానుల మధ్య కూడా అంతరాలున్నాయి. ముఖ్యంగా చిరు-బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఎప్పట్నుంచో వార్ నడుస్తోంది. ఐతే మహేష్ వారిని పరిగణనలోకి తీసుకోలేదనే అనుకోవాలి. ఇక రవితేజ.. నాని.. నాగచైతన్య.. రానా.. రామ్‌.. సాయిధ‌ర‌మ్ లాంటి హీరోలను మహేష్ పెద్ద హీరోలుగా పరిగణించట్లేదన్నమాట.

మొత్తానికి మహేష్ లెక్క అయితే కరెక్టుగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్టార్ ఇమేజ్ లాంటి విషయాల గురించి మహేష్ పట్టించుకోనట్లే ఉంటాడు కానీ.. అతడి తాజా వ్యాఖ్యలు మాత్రం ఆ అభిప్రాయాన్ని మార్చాయి. ఈ తరంలో ప్రేక్షకులు ఎవరినైతే పెద్ద హీరోలుగా అనుకుంటున్నారో.. వాళ్ల గురించి సరిగ్గానే మహేష్ లెక్క వేసి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు