మోడీ డిక్టేట‌ర్.. ఎంత‌లా వేధించారో చెప్పిన బాబు

మోడీ డిక్టేట‌ర్.. ఎంత‌లా వేధించారో చెప్పిన బాబు

మోడీతో ఢీ కొట్టేందుకు చాలా ధైర్యం కావాలి. అందుకు నేర్పు.. ఓర్పు చాలా అవ‌స‌రం. అవ‌న్నీ త‌న‌లో పుష్క‌లంగా ఉన్నాయ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే ఫ్రూవ్ చేసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా మోడీ మీద వార్ ను షురూ చేశారు. తాజాగా ఆయ‌న అఖిల‌ప‌క్షంతో మాట్లాడిన స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర అంశాల్ని చెప్పుకొచ్చారు.

అఖిల‌ప‌క్ష స‌మావేశంలో మోడీని ఉద్దేశించి చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న్ను డిక్టేట‌ర్ గా అభివ‌ర్ణించారు. బాబు మాట‌ల్లోనే చూస్తే.. "మోడీ డిక్టేట‌ర్ త‌ర‌హా నాయ‌కుడు. ముందుగానే ఎన్డీయే స‌ర్కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే మ‌రిన్ని వేధింపులు ఉండేవి. పోల‌వ‌రంతో స‌హా అనేక ప్రాజెక్టుల‌కు ఇక్క‌ట్లు ఎదుర‌య్యేవి. వాళ్లు న‌మ్మ‌క‌ద్రోహం చేస్తున్నార‌ని పూర్తిగా రూఢీ చేసుకునేదాకా ఎన్డీయేలో ఉండి హ‌క్కుల కోసం పోరాడా" అంటూ చెప్పారు.

కొంద‌రు చెబుతున్న‌ట్లుగా ముందే ఎన్డీయే స‌ర్కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే ఏం జ‌రిగి ఉండేదో బాబు చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రిత‌మే ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటే వేధింపులు తీవ్రంగా ఉండేవ‌ని.. అందుకే ఆచితూచి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. అంతేకాదు.. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే కేంద్రం పెద్ద‌లు ఏపీపై దృష్టి పెడ‌తార‌ని.. ఏపీకి న‌ష్టం క‌లిగించేలా చూసే అవ‌కాశం ఉంద‌న్నారు.

మ‌న‌తో పెట్టుకుంటే మ‌న‌కంటే వారే ఎక్కువ న‌ష్ట‌పోవ‌టం ఖాయ‌మ‌న్న మాట బాబు నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. ఎలాంటి స‌మ‌స్య‌నైనా.. కుట్ర‌నైనా ఎదుర్కొనే నైతిక స్థైర్యం త‌న‌కుంద‌న్న బాబు.. త‌న‌తో కేంద్ర‌మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ అన్న మాట‌ల్ని ప్ర‌స్తావించారు. తాము అనుకుంటే పోల‌వ‌రం.. అమ‌రావ‌తిల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇవ్వ‌కుండా ఆపేవాళ్ల‌మ‌ని త‌న‌తో చెప్పార‌న్నారు.

త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న గురించి చెప్పిన బాబు.. ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి ఢిల్లీలో అంద‌రికి వివ‌రించాన‌ని.. ఢిల్లీలో మోడీకి వ్య‌తిరేకంగా మ‌నం త‌ప్ప ఎవ‌రూ మాట్లాడ‌లేద‌ని.. ఈ కార‌ణంగా త‌న మీద అనేక ర‌కాల ఒత్తిళ్లు వ‌స్తాయ‌ని తెలుస‌ని.. రాబోయే రోజుల్లో ఏపీ ప‌ట్ల వారు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అర్థం చేసుకోవ‌చ్చంటూ బాబు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ఎన్డీయేలో క‌లిసి ఉన్న‌ప్పుడు మోడీ స‌ర్కారు త‌మ‌తో ఎలా ఉండేవారో చెప్పిన బాబు.. రానున్న రోజుల్లో ఎలా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు