డైలాగులు కూడా త్రివిక్రమే రాశాడా..

డైలాగులు కూడా త్రివిక్రమే రాశాడా..

నిన్న రిలీజైన నితిన్ సినిమా ‘చల్ మోహన్ రంగ’ చూసిన వాళ్లందరికీ ఒకటే సందేహం..? ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం కథ మాత్రమే అందించాడా అని. టైటిల్ క్రెడిట్స్‌లో త్రివిక్రమ్ కథ మాత్రమే రాసినట్లు పడింది. డైలాగులు దర్శకుడు కృష్ణచైతన్యనే రాసినట్లు వేశారు. కానీ సినిమా చూసిన వాళ్లందరికీ త్రివిక్రమ్ మాటల మ్యాజిక్కే కనిపించింది.
    
ఆయన మార్కు చమక్కులు.. సెన్సాఫ్ హ్యూమర్ ప్రతి సీన్లోనూ కనిపించింది. ఏదో ఒకటి రెండు చోట్ల అంటే త్రివిక్రమ్ ప్రభావంతో కృష్ణచైతన్య ఒకట్రెండు చోట్ల ఆయన్ని అనుకరించే ప్రయత్నం చేశాడేమో.. లేదంటే త్రివిక్రమ్ కథ రాసినపుడే కొన్ని డైలాగులు మెన్షన్ చేశాడేమో అనుకోవచ్చు. కానీ సినిమా అంతటా త్రివిక్రమ్ మార్కు స్పష్టంగా కనిపించింది.

అందుకే ఈ చిత్రానికి కథతో పాటు డైలాగులు కూడా ఆయనే రాసి.. డైలాగ్స్ క్రెడిట్ తీసుకోలేదమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ త్రివిక్రమ్ ప్రమేయం ఏదీ లేదనుకున్నా.. దర్శకుడిగా తొలి సినిమా ‘రౌడీ ఫెలో’లో మాటల రచయితగా బలమైన ముద్ర వేసిన కృష్ణచైతన్య ఈ స్థాయిలో త్రివిక్రమ్ శైలిని ఫాలో అయిపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే.

డైలాగ్స్ క్రెడిట్ ఎవరిదైనప్పటికీ.. సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణ మాత్రం అవే. డైలాగ్స్ మీద నడిచే కామెడీనే కొంత వరకు సినిమాను నిలబెట్టింది. కథాకథనాల పరంగా మాత్రం ఏ విశేషం లేదు. ఏదో కామెడీతో అలా టైంపాస్ చేసేద్దాం అనుకున్న వాళ్లకు తప్ప ఇంకేదో ఆశిస్తే మాత్రం ‘చల్ మోహన్ రంగ’ నిరాశ పరిచేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు