విశాల్ పై కోలీవుడ్లో తీవ్ర విమర్శలు

విశాల్ పై కోలీవుడ్లో తీవ్ర విమర్శలు

తమిళ నడిగర్ సంఘం కార్యదర్శిగా.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా చాలా మంచి పనులే చేశాడు విశాల్. అతడి నాయకత్వ లక్షణాల్ని అందరూ మెచ్చుకున్నారు. ఐతే కోలీవుడ్ నిర్మాతల సమస్యల పరిష్కారం సమ్మెకు పిలుపునిచ్చిన విశాల్.. మొత్తం సినీ కార్యకలాపాలన్నింటినీ నిలిపి వేయించిన సంగతి తెలిసిందే గత నెల 2 నుంచి సినిమాల ప్రదర్శన ఆగిపోగా.. 16 నుంచి మిగతా సినీ కార్యకలాపాలూ ఆగిపోయాయి.

షూటింగులు.. ఆడియో వేడుకలు.. మిగతా కార్యక్రమాలన్నింటికీ బ్రేక్ పడింది. సినిమాల ప్రదర్శనకు డిజిటల్ ప్రొవైడర్లు వసూలు చేసే ఫీజు తగ్గించడంతో పాటు మరిన్ని డిమాండ్లతో ఈ సమ్మె నడుస్తోంది.

ఐతే దీని వల్ల తీవ్ర నష్టాల పాలవుతున్నామంటూ వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. షూటింగులు ఆగిపోవడం.. నెల రోజులుగా కొత్త సినిమాల రిలీజులు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ సమ్మె విషయంలో వెనుకంజ వేసేది లేదంటున్నాడు విశాల్. ఇలా అందరినీ ఆపి ఉంచిన విశాల్.. మూడు సినిమాలకు మాత్రం షూటింగ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంపై కొందరు నిర్మాతలు భగ్గుమంటున్నారు. అందులో విజయ్-మురుగదాస్ సినిమా కూడా ఉంది. ఆ చిత్ర షూటింగ్ కొనసాగించడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చిన విషయాన్ని విశాల్ అంగీకరించాడు.

ఈ చిత్రం కోసం ఒక పెద్ద యాక్షన్ కొరియోగ్రాఫర్‌ను పెట్టుకున్నారని.. అతను మూడు నెలల తర్వాత అందుబాటులో ఉండడని.. దీంతో మొత్తం షెడ్యూళ్లన్నీ అస్తవ్యస్తమవుతాయని చెప్పడంతో అనుమతి మంజూరు చేసినట్లు విశాల్ చెప్పాడు. ఐతే ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన ఇబ్బంది ఉంటుందని.. అలా అని అందరికీ అనుమతి ఇస్తారా అని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అందరూ ఏకతాటిపై ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని.. అలా కాకుండా ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఎంత వరకు సబబని అంటున్నారు. మరి ఈ స్థితిలో విశాల్ సమ్మెను ఎలా నడిపిస్తాడో.. సమస్యలు ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు