రైటర్ త్రివిక్రమ్ ఏం చేస్తాడో?

రైటర్ త్రివిక్రమ్ ఏం చేస్తాడో?

ఈ ఏడాది దర్శకుడిగా ‘అజ్ఞాతవాసి’తో పెద్ద ఎదురు దెబ్బే తిన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు ఆయనకు మరో పరీక్ష ఎదురు కాబోతోంది. ఐతే ఈ పరీక్ష దర్శకుడిగా కాదు. రచయితగా.. నిర్మాతగా. ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ కథ అందించిన ‘చల్ మోహన్ రంగ’ గురువారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. త్రివిక్రమ్ అనే పేరు జనాలకు తెలిసింది.. ఆయనకు తిరుగులేని గుర్తింపు వచ్చింది.. రచయితగానే.

‘నువ్వే నువ్వే’తో దర్శకుడిగా మారడానికంటే ముందే రచయితగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు త్రివిక్రమ్. ‘స్వయం వరం’తో మొదలుపెడితే ‘మల్లీశ్వరి’ వరకు రచయితగా ఆయన ప్రస్థానం అద్భుతంగా సాగింది. ఐతే దర్శకుడిగా స్థిరపడ్డాక ఒక్క ‘తీన్ మార్’కు మినహాయిస్తే మరే సినిమాకూ రచన చేయలేదు త్రివిక్రమ్. ఆ చిత్రానికి కూడా మాటలు రాశాడే తప్ప కథ అందించలేదు.

మరి దర్శకుడిగా ఖాళీ లేని టైంలో ‘చల్ మోహన్ రంగ’కు కథ అందించడం.. పైగా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించడంతో దీనిపై క్యూరియాసిటీ నెలకొంది. అందులోనూ ‘అజ్ఞాతవాసి’ భారీ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ పేరుతో వస్తున్న సినిమా కావడంతో కనీసం రచయితగా అయినా త్రివిక్రమ్ ఫాం చాటుకుంటాడా.. తన ముద్ర చూపిస్తాడా అని జనాలు చూస్తున్నారు.

లిరిసిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ కృష్ణచైతన్య ‘రౌడీఫెలో’ సినిమాతో త్రివిక్రమ్‌ను మెప్పించి రెండు మూడేళ్లుగా ఆయనతో ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన పర్యవేక్షణలోనే అతను స్క్రిప్టు తీర్చిదిద్దినట్లు సమాచారం. మరి త్రివిక్రమ్ బ్యాకప్‌తో వస్తున్న ‘చల్ మోహన్ రంగ’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు