నోలన్‌ను మెస్మరైజ్ చేసిన ఇండియన్ సినిమా

నోలన్‌ను మెస్మరైజ్ చేసిన ఇండియన్ సినిమా

క్రిస్టఫర్ నోలన్.. ప్రస్తుతం హాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. ‘ది ఇన్సెప్షన్’.. ‘ఇంటర్‌స్టెల్లార్’.. ‘డన్ కిర్క్’ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దర్శకుడిగా మారాడు నోలన్. అతను కొన్ని రోజులుగా భారత్‌లో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ సినిమా గురించి గొప్పగా చెప్పాడు. తనకు భారతీయ సినిమాపై ముందు నుంచే చాలా ఆసక్తి ఉందని.. ఇప్పుడు ఆ ఆసక్తి మరింత పెరిగిందని అన్నాడు. మీకు బాగా నచ్చిన ఇండియన్ సినిమా ఏదని అడిగితే.. ‘పథేర్ పాంచాలి’ అని చెప్పాడు నోలన్.

ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే రూపొందించిన ఈ బెంగాలీ సినిమా తనను మెస్మరైజ్ చేసిందని నోలన్ తెలిపాడు. సత్యజిత్ రే దర్శకత్వ ప్రతిభ అమోఘమని అతనన్నాడు. మున్ముందు మరిన్ని ఇండియన్ సినిమాలు చూడాలనుకుంటున్నానని నోలన్ తెలిపాడు. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని.. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని అన్నాడు. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాది లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్‌ను కలిసిన నోలన్.. ఆయన నటించిన ‘పాపనాశం’ సినిమాను కూడా చూసినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నోలన్‌కు తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘హే రామ్’ చిత్రం డీవీడీని అందజేశాడు కమల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు