కాలా సెన్సారట.. 14 కట్స్ అట

కాలా సెన్సారట.. 14 కట్స్ అట

ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లుగా ఉంది ఈ వ్యవహారం చూస్తే. ఓ పక్క తమిళనాట సినీ కార్యకలాపాలన్నీ ఆపేసి అందరూ సైలెంటుగా ఉన్నారు. షూటింగుల్లేవు. సినిమాల ప్రదర్శన లేదు. సినిమా ఫంక్షన్లు లేవు. ఇంకే రకమైన కార్యకలాపాలు కూడా లేవు. నెల రోజులుగా కోలీవుడ్లో అన్ని కార్యక్రమాలూ స్తంభించిపోయాయి. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ సెన్సార్ అయిపోయిందని.. ఈ చిత్రంలో చాలా అభ్యంతరకర సన్నివేశాలున్నాయని.. సెన్సార్ బోర్డు 14 కట్స్ ఇచ్చిందని వార్తలు గుప్పుమన్నాయి. ఐతే ఇది శుద్ధ అబద్ధమి తేలింది. కోలీవుడ్లో సినిమాల్ని సెన్సార్‌కు పంపే విషయంలోనూ ఆంక్షలున్నాయిప్పుడు. ఇక ‘కాలా’ సెన్సార్ ఎక్కడ చేయిస్తారు?

‘2.0’ బదులు ఏప్రిల్ 27న ‘కాలా’ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యమయ్యేలా లేదు. నెల రోజులుగా సినిమాల విడుదల ఆగిపోయింది. చాలా సినిమాలు పెండింగులో పడిపోయాయి. సమ్మె ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ముగిసినా ముందు రిలీజ్ కావాల్సిన సినిమాల్ని ముందు క్లియర్ చేయాల్సి ఉంది. మరోవైపు ‘కాలా’కు సంబంధించి కూడా కొంత వర్క్ బ్యాలెన్స్ ఉండిపోయింది. అది పూర్తి చేయాలి. ఇన్ని అడ్డంకుల మధ్య ఏప్రిల్ 27న ‘కాలా’ను రిలీజ్ చేయడం దాదాపు అసాధ్యమనే అంటున్నారు. సమ్మె ఎప్పుడు విరమిస్తారన్నదాన్ని బట్టి ఈ చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు