‘రంగస్థలం’లో ఆ సీన్ చూసి ఆమె కన్నీళ్లు

‘రంగస్థలం’లో ఆ సీన్ చూసి ఆమె కన్నీళ్లు

సినిమా అనేది కల్పనే. అందులో పాత్రలది నటనే. అయినప్పటికీ తెరమీద దృశ్యం చూస్తున్నపుడు దాన్ని నిజం లాగే ఫీలవుతాం. కొన్నిసార్లు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటాం. సామాన్య ప్రేక్షకులే కాదు సినిమా వాళ్లు కూడా కొన్నిసార్లు ఇలాగే ఉద్వేగానికి గురవుతుంటారు. తెరమీద దృశ్యాలు చూసి తట్టుకోలేకపోతుంటారు. గతంలో ‘గమ్యం’ సినిమాలో అల్లరి నరేష్ చనిపోయే సీన్ చూసి అతడి తల్లి చాలా బాధ పడింది. మళ్లీ ఇలాంటి చనిపోయే సీన్ చేయొద్దంటూ కొడుక్కి షరతు పెట్టింది. నిత్యామీనన్ సైతం ఇలా తాను చనిపోయే సీన్లు చూసి బాధతో ఇకపై ఆ తరహా పాత్రలు చేయొద్దని నిర్ణయించుకుంది. తాజాగా మరో హీరో తల్లి తన కొడుకు చనిపోయే సీన్ చూసి ఉద్వేగానికి గురైంది.

తెలుగు వాడైన తమిళ కథానాయకుడు ఆది పినిశెట్టి తాజాగా ‘రంగస్థలం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. అందులో ఆది పాత్ర చివర్లో చనిపోతుంది. అతడి అంత్యక్రియల సందర్భంగా గుండెల్ని పిండేసేలా ఒక పాట కూడా వస్తుంది. అది చూస్తే ఆటోమేటిగ్గా కన్నీళ్లు వచ్చేస్తాయి. సామాన్య ప్రేక్షకులే ఉద్వేగానికి గురవుతారు. అలాంటిది ఆది కుటుంబ సభ్యుల గురించి చెప్పేదేముంది? ఆది తన తల్లిదండ్రులతో కలిసి ఈ సినిమా చూశాడట. ఆ సందర్భంగా అతడి తల్లి ఆ సన్నివేశాలు చూసి తట్టుకోలేకపోయిందట. ఏడ్చేసిందట. అది సినిమా అని చెప్పి తాను ఓదార్చాల్సి వచ్చిందని.. స్వయంగా దర్శకుడైన తన తండ్రి రవిరాజా పినిశెట్టి సైతం ఆ సమయంలో ఉద్వేగానికి  గురయ్యాడని ఆది వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు