మహేష్ బాగుంటే.. చరణ్‌ది మూణ్నాళ్ల ముచ్చటే

మహేష్ బాగుంటే.. చరణ్‌ది మూణ్నాళ్ల ముచ్చటే

‘మగధీర’ మినహాయిస్తే రామ్ చరణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ లేదు. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ చూసిన చరణ్.. మళ్లీ దానికి దరిదాపుల్లో నిలిచే హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. ఐతే ఇంత కాలానికి ‘రంగస్థలం’తో వసూళ్ల మోత మోగిస్తూ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు చరణ్. ఈ చిత్రం ఇప్పటికే కొన్ని నాన్-బాహుబలి రికార్డుల్ని సొంతం చేసుకుంది.

ఫుల్ రన్లో ఓవరాల్ కలెక్షన్లలోనూ రికార్డులు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఒకవేళ చరణ్ ఈ రికార్డులు సాధిస్తే.. అవి ఎంత కాలం ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే ఈ వేసవిలోనే రెండు భారీ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. వాటి మీద భారీ అంచనాలున్నాయి. నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టే సత్తా  ఆ రెంటికీ ఉంది.

ముఖ్యంగా మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ అంచనాలకు తగ్గట్లు ఉంటే రికార్డుల మోత మోగడం ఖాయం. మామూలుగానే మహేష్ బాబు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆటోమేటిగ్గా పాత రికార్డులు బద్దలైపోతుంటాయి. అందులోనూ ‘శ్రీమంతుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఇది. ఇది అంచనాలకు తగ్గట్లు ఉంటే.. పాత.. కొత్త రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయం. అలవోకగా నాన్-బాహుబలి రికార్డును అందుకుంటుంది ఈ చిత్రం.

కొరటాల సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ అనే అంచనాలు జనాల్లో ఉన్నాయి. పైగా సమ్మర్ సీజన్లో.. పోటీ లేకుండా రిలీజవుతున్న సినిమా ఇది. తర్వాతి వారం రావాల్సిన ‘కాలా’ కూడా వాయిదా పడ్డట్లే కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు కావాల్సిందల్లా పాజిటివ్ టాకే. అదొస్తే మాత్రం చరణ్ రికార్డులు మూణ్నాళ్ల ముచ్చటే అవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు