‘ఎన్టీఆర్’లో చేస్తారా అని తారక్‌ను అడిగితే..

‘ఎన్టీఆర్’లో చేస్తారా అని తారక్‌ను అడిగితే..

ఒకప్పుడు నందమూరి బాలకృఫ్ణతో సన్నిహితంగానే ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ గత కొన్నేళ్లలో ఇద్దరికి దూరం పెరిగింది. అది అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. అసలు తారక్ ఊసెత్తడానికే బాలకృఫ్ణ ఇష్టపడట్లేదు. తారక్ మాత్రం బాలయ్య ప్రస్తావన వస్తే తమ మధ్య ఏమీ లేదన్నట్లుగా ఒక డైలాగ్ వేసేసి ఆ చర్చకు అక్కడితో తెరదించుతున్నాడు.

తాజాగా ఎన్టీఆర్‌కు మరోసారి బాలయ్యకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్-2018 బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన తారక్.. ఇందుకోసం చేసిన యాడ్ లాంచింగ్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ‘యన్.టి.ఆర్’ సినిమా ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాలో నటించాలని మీకేమైనా పిలుపు వచ్చిందా అని ఎన్టీఆర్‌ను ఓ విలేకరి ప్రశ్నిస్తే.. ‘‘నాకైతే ఎలాంటి పిలుపూ రాలేదు. మీకొస్తే చెప్పండి చేసేద్దాం’’ అంటూ నవ్వుతూ బదులిచ్చాడు తారక్.

ఏ హీరో జీవిత కథతో తెరకెక్కే సినిమాలోనూ నటించడానికి తనకు గట్స్ లేవని తారక్ అన్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి చేయబోయే మల్టీస్టారర్ గురించి అడిగితే.. జక్కన్న ఇంకా తమకు కథ చెప్పలేదని.. ఈ సినిమాకు సిద్ధం కమ్మని మాత్రం అన్నాడని తారక్ వెల్లడించాడు. తన ఆల్ టైం ఫేవరెట్ క్రికెటర్ సచిన్ అని.. చిన్నప్పటి నుంచి తనకు మాస్టర్ బ్లాస్టర్ స్ఫూర్తిగా నిలిచాడని తారక్ ఈ కార్యక్రమంలోనే వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు