దేవిశ్రీ తనను చంపేశాడన్న ఆ సింగర్

దేవిశ్రీ తనను చంపేశాడన్న ఆ సింగర్

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల చర్చలన్నీ ‘రంగస్థలం’ చుట్టూనే తిరుగుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని అందుకోవడంలో విజయవంతమైంది. వసూళ్లు అంచనాల్ని మించే ఉంటున్నాయి. వీకెండ్ తర్వాత కూడా ఈ చిత్రం స్టడీగా సాగుతోంది. ఐతే ఈ చిత్రానికి సంబంధించి ఓ వివాదం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఈ చిత్రంలోని ‘ఆ పక్కనుంటావా’ అంటూ సాగే పాటను శివనాగులు అనే జానపద గాయకుడితో పాడించిన దేవిశ్రీ ప్రసాద్.. సినిమాలో మాత్రం అతడి వెర్షన్ తీసేసి తాను పాడిన పాటను పెట్టేశాడు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివనాగులు వాయిస్ రామ్ చరణ్ కు సెట్టవ్వదన్న కారణంతో దేవి వెర్షన్ పెట్టామన్న సుకుమార్ వెర్షన్ తో జనాలు ఏకీభవించట్లేదు. నిజానికి చరణ్ కు దేవి వాయిసే మిస్ ఫిట్ అంటున్నారు.

ఈ గొడవపై శివనాగులు ఒక టీవీ ఛానెల్లో మాట్లాడాడు. అతను చాలా హుందాగా స్పందించాడు. అతడి స్పందన చూస్తే బాధ కలగక మానదు. తాను చిన్న చిన్న వేదికల మీద పాటలు పాడుకునేవాడినని... ఐతే ‘రంగస్థలం’ లాంటి పెద్ద సినిమాలో దేవిశ్రీ తనకు అవకాశం ఇచ్చాడని శివనాగులు చెప్పాడు. తన పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి చేరబోతోందని చాలా సంతోషించానని.. తన స్నేహితులు.. శ్రేయోభిలాషులు అందరికీ చెప్పుకుని మురిసిపోయానని అన్నాడు.

ఐతే ‘రంగస్థలం’ మార్నింగ్ షో చూసిన తన స్నేహితులు సినిమాలు తన పాట లేదని చెప్పారని.. కానీ తాను నమ్మలేదని.. మ్యాట్నీ వెళ్లి చూస్తే అదే నిజమని తేలిందని.. ఇక ఆ రోజంతా తనకు ఫోన్ చేసిన వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదని.. చచ్చిపోయినట్లు అనిపించిందని శివనాగులు చెప్పాడు. ఏదైనా కారణం వల్ల తన పాటను తీసేయాల్సి వస్తే.. కనీసం తనకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే కొంత టైం తీసుకుని అయినా సమాధానపడేవాడినని.. కానీ తనకు చెప్పకుండా పాట తీసేయడం మనోవేదనకు గురి చేసిందని శివనాగులు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు