తన విదేశీ అల్లుడిపై జగపతిబాబు మాట ఇది..

 తన విదేశీ అల్లుడిపై జగపతిబాబు మాట ఇది..

దేశంలో కుల ప్రభావం బాగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్లలో కుల పట్టింపు బాగా ఎక్కువ ఉంటుంది. సినీ రంగంలో ఉన్న వాళ్లు కూడా తమ పిల్లలకు కులం చూసే పెళ్లిళ్లు చేయడం గమనించవచ్చు. ఐతే సీనియర్ హీరో జగపతిబాబు మాత్రం అదేమీ పట్టించుకోలేదు.

వేరే కులం కాదు.. వేరే మతం, వేరే దేశానికి చెందిన వ్యక్తితో తన పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. ఆమె ప్రేమించిన విదేశీ వ్యక్తితో ఏ అభ్యంతరం లేకుండా పెళ్లి చేశాడు. అప్పట్లో ఇది చర్చనీయాంశమైంది. ఐతే తన కులానికి చెందిన వాళ్ల నుంచే తాను చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నట్లు జగపతిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

తన కూతురు ప్రేమ విషయం చెప్పగానే తననే బాగా ఆలోచించుకోమని చెప్పానని.. ఒక తండ్రిగా ఒక విదేశీయుడితో పెళ్లి చేయడానికి తాను కూడా కొంచెం కంగారుపడ్డానని.. కానీ ఇద్దరు ప్రేమించుకున్నాక ఎవరూ అడ్డు పడలేమని జగపతి అన్నాడు. తన కూతురిని వచ్చే 30-40 ఏళ్ల గురించి ఆలోచించమని చెప్పానని.. ఆమె అన్నీ ఆలోచించుకున్నాక కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పగానే తాను ఓకే చెప్పానని.. ఎవరి గురించీ ఆలోచించలేదని జగపతి తెలిపాడు.

తన తల్లి పెళ్లి విషయంలో కొంచెం భయపడిందని.. కానీ తానే ఆమెకు కూడా సర్దిచెప్పానని చెప్పాడు. ఇప్పుడు తన కూతురు-అల్లుడు అన్యోన్యంగా సంతోషంగా గడుపుతున్నారని.. ఏ ఇబ్బందులూ లేవని జగపతి అన్నాడు. మన ఇంట్లో ఒక పని ఉంటే వేరే కులం వాడే చేయాలని.. అక్కడ రాని ఇబ్బంది పెళ్లిళ్ల విషయంలో ఎందుకొస్తుందో తనకు అర్థం కాదని జగపతి అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు