భరత్, సూర్యలకు చరణ్ విషెస్

భరత్, సూర్యలకు చరణ్ విషెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మామూలు ఆనందంలో లేడు. అతడి కొత్త సినిమా ‘రంగస్థలం’ మంచి టాక్‌తో మొదలై భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. ఇది చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయ్యేలా ఉంది. కేవలం వసూళ్లు మాత్రమే కాదు.. తన నటనకు వస్తున్న ప్రశంసలు కూడా చరణ్‌కు అమితానందాన్నిచ్చేవే. ఈ ఆనందాన్ని చిత్ర థ్యాంక్స్ మీట్లో పంచుకున్నాడు చరణ్.

ఒక సినిమాకు మంచి టాక్ మాత్రమే కాక.. మంచి వసూళ్లు కూడా వస్తే చాలా సంతృప్తిగా ఉంటుందని చరణ్ చెప్పాడు. ‘రంగస్థలం’ చిత్ర కలెక్షన్ల గురించి వస్తున్న రిపోర్ట్స్ చాలా చాలా ఆనందాన్నిస్తున్నాయని చరణ్ తెలిపాడు.

ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టిన బయ్యర్లు, ఎగ్జిబిటర్లు చాలా సంతోషంగా ఉన్నారని.. అందరూ మంచి లాభాలు అందుకుంటున్నారని చరణ్ చెప్పారు. వేరే రంగంలో వాళ్లు ఒక చోట డబ్బులొస్తే ఇంకో చోట తీసుకెళ్లి పెట్టుబడి పెడతారని.. ఐతే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమాల్లో లాభాలొస్తే మళ్లీ ఆ డబ్బును తీసుకెళ్లి ఇంకో సినిమా కోసం ఖర్చు పెడతారని చరణ్ అన్నాడు.

ఈ వేసవిలో మరో రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయని.. అవి కూడా ‘రంగస్థలం’ లాగే బాగా ఆడి అందరికీ మంచి లాభాలు అందించాలని చరణ్ అభిలషించాడు. పేర్లు చెప్పకపోయినప్పటికీ చరణ్ మాట్లాడింది ‘భరత్ అనే నేను’.. ‘నా పేరు సూర్య’ల గురించే అన్నది స్పష్టం. మరి చరణ్ కోరుకున్నట్లే ఆ రెండు సినిమాలు కూడా బాగా ఆడి టాలీవుడ్‌కు ఊపు తెస్తాయేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు