300 కోట్ల సినిమా మొదలవుతుందట

300 కోట్ల సినిమా మొదలవుతుందట

తమిళ సీనియర్ దర్శకుడు సుందర్ ‘సంఘమిత్ర’ పేరుతో ఓ భారీ సినిమా తీయడానికి దాదాపు మూడేళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదల తర్వాత దాన్ని మించేలా ఈ సినిమా తీయాలని సుందర్ పట్టుదలతో రంగంలోకి దిగాడు రెండేళ్ల పాటు ప్రి ప్రొడక్షన్ పనులు చేసి.. గత ఏడాది ఇదే సమయానికి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశాడు.

కానీ అతడి ప్రణాళికలు అనుకున్న ప్రకారం సాగలేదు. అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ముందుకు కదల్లేదు. ఇంతలో హీరోయిన్ శ్రుతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఇంకేవో ఇబ్బందులు కూడా తలెత్తి సినిమా ఆగిపోయింది. మధ్యలో సుందర్ వేరే సినిమాలోకి వెళ్లిపోయాడు. దీంతో ‘సంఘమిత్ర’ ఇక ఎప్పటికీ మొదలు కాదేమో అన్న సందేహాలు నెలకొన్నాయి.

ఐతే తాజా సమచారం ప్రకారం ‘సంఘమిత్ర’ ఈ ఏడాది జులైలో సెట్స్ మీదికి వెళ్తుందట. సుందర్ ఇటీవలే మళ్లీ ఈ చిత్రానికి సంబంధించి పనులు మొదలుపెట్టారట. షూటింగ్ షెడ్యూల్స్.. ఇతర కార్యక్రమాలకు సంబంధించి పక్కా ప్రణాళిక రెడీ చేస్తున్నారట. జయం రవి.. ఆర్య హీరోలుగా నటించే ఈ చిత్రంలో హిందీ భామ దిశా పఠానిని కథానాయికగా ఫైనలైజ్ చేశారు. ఆమె ఈ చిత్రం కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలిసింది.

తమిళంలో 100కు పైగా సినిమాలు నిర్మించిన థెండ్రాల్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇది ‘బాహుబలి’కి దీటుగా నిలుస్తుందన్న ధీమాతో తమిళ చిత్ర పరిశ్రమ ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English