బోయపాటి సినిమాకి కూడా సేమ్‌ ఫార్ములా

బోయపాటి సినిమాకి కూడా సేమ్‌ ఫార్ములా

బోయపాటితో చరణ్‌ సినిమా ఎప్పుడో జరగాల్సింది. అయితే అప్పట్లో బోయపాటి చెప్పిన కథలో ఎలాంటి వెరైటీ లేదని, అలాంటి మాస్‌ సినిమాలు చాలా చేసేసానని చరణ్‌ దానిని రిజెక్ట్‌ చేసాడు. ధృవ, రంగస్థలం చిత్రంతో వెరైటీని అందించిన చరణ్‌ మళ్లీ ఇప్పుడు బోయపాటి శ్రీనుతో సినిమా అనేసరికి రైట్‌ ట్రాక్‌లోకి వచ్చాడని ఆనందిస్తోన్న అభిమానులే కలవర పడుతున్నారు. మూస సినిమాలకి పెట్టింది పేరయిన బోయపాటి శ్రీనుతో ఈ టైమ్‌లో ఎందుకు చేస్తున్నాడనే ఆందోళన ఇంకా చాలా మందిలో వుంది.

రంగస్థలం విజయం తర్వాత ఈ ప్రాజెక్ట్‌ కాల్‌ ఆఫ్‌ చేస్తాడని ఎదురు చూస్తున్న వాళ్లు కూడా ఎంతో మంది వున్నారు. అయితే ధృవ, రంగస్థలం చిత్రాల్లో వున్న వైవిధ్యం ఈసారి బోయపాటి రాసిన కథలోను వుండడం వల్లే ఈ చిత్రాన్ని అతను అంగీకరించాడట. రెగ్యులర్‌ బోయపాటి శ్రీను సినిమాల తరహా హీరోయిజం, మాస్‌ ఎలిమెంట్స్‌ వున్నా కానీ ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం, వినోదం, ఎమోషన్స్‌ అన్నీ కూడా ఇందులో వున్నాయట. ఇది బోయపాటి శ్రీనుకి మేకోవర్‌ లాంటి సినిమా అని చెబుతున్నారు. రంగస్థలం ప్రమోషన్స్‌ కోసం వారం రోజులు విరామం తీసుకున్న చరణ్‌ అవి పూర్తి కాగానే బోయపాటి చిత్రం తదుపరి షెడ్యూల్‌లో పాల్గొంటాడు.