రంగస్థలం ఎక్కడ ఆగుతుంది?

రంగస్థలం ఎక్కడ ఆగుతుంది?

ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం. సంక్రాంతికి వచ్చిన ‘అజ్ఞాతవాసి’ గురించి ఏదేదో ఊహించుకున్నారంతా. నాన్-బాహుబలి రికార్డులన్నిటినీ ఇది అలవోకగా బద్దలు కొట్టేస్తుందని అంచనా వేశారు. కానీ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక దాని తర్వాత విడుదలైన ఆ స్థాయి పెద్ద సినిమా ‘రంగస్థలం’కు క్రేజ్ బాగానే ఉన్నప్పటికీ.. రామ్ చరణ్‌కు ఉన్న మార్కెట్ ప్రకారం చూస్తే దీనిపై బయ్యర్లు రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టడం పెద్ద సాహసమే అని.. సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావడం అంత ఈజీ కాదని అన్నారు ట్రేడ్ పండిట్లు. కానీ ‘రంగస్థలం’ అనూహ్యమైన ఓపెనింగ్స్‌తో ఆశ్చర్యపరిచింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల షేర్ సాధించి.. నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పింది.

ఈ చిత్రం రెండో వారాంతానికి లాభాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ‘మగధీర’ వసూళ్లను దాటడం లాంఛనమే అనిపిస్తోంది. రూ.80 కోట్ల షేర్ దీనికి కేక్ వాక్ లాగే అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఈ చిత్రం ఏ స్థాయికి వెళ్తుందన్నది చూడాలి. ప్రస్తుతం నాన్-బాహుబలి సినిమాల్లో చిరంజీవి సినిమా ‘ఖైదీ నంబర్ 150’ రూ.105 కోట్ల షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ‘శ్రీమంతుడు’ రూ.95 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

'శ్రీమంతుడు'ను ‘రంగస్థలం’ దాటడం కష్టం కాకపోవచ్చు. కానీ ‘ఖైదీ’ రికార్డును అందుకోవడం మాత్రం అంత సులువు కాదు. రెండో వారాంతంలో కూడా ఈ సినిమా అసాధారణ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అది ఈ వీకెండ్లో రాబోయే నితిన్ సినిమా ‘చల్ మోహన్ రంగ’ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘రంగస్థలం’ వసూళ్లపై ప్రభావం ఉంటుంది. మరి ‘రంగస్థలం’ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు