చివరికి హిట్టనాలా.. ఫట్టనాలా?

చివరికి హిట్టనాలా.. ఫట్టనాలా?

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘రంగస్థలం’ మీదే ఉంది. దానికే బాక్సాఫీస్ దగ్గర అగ్ర తాంబూలం. చర్చలన్నీ దాని గురించే. వసూళ్లన్నీ దానికే. వేరే సినిమాల గురించి అసలు డిస్కషనే లేదు. దీని దెబ్బకు చాలా సినిమాలు థియేటర్ల నుంచి లేచిపోయాయి. ఉన్న సినిమాల పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు.

‘రంగస్థలం’ వల్ల పెద్ద దెబ్బ తగిలింది ‘ఎమ్మెల్యే’ సినిమాకే. ‘రంగస్థలం’ రావడానికి వారం ముందే ఈ చిత్రం థియేటర్లలోకి దిగింది. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది. తొలి వారాంతంలో వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వారాంతపు వసూళ్లు సాధించిందీ చిత్రం. కానీ వీకెండ్ తర్వాత వసూళ్లలో డ్రాప్ కనిపించింది.

తొలి వారాంతంలో ‘ఎమ్మెల్యే’ బయ్యర్ల పెట్టుబడిలో సగం దాకా రాబట్టగలిగింది. ఆ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే సగానికి పైగానే రాబట్టాల్సి ఉండగా.. రెండో వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంది. కానీ ‘రంగస్థలం’ మంచి టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ మొత్తాన్ని ఆక్రమించేసింది. మెజారిటీ థియేటర్లలో ఈ చిత్రాన్నే నడిపించారు వారాంతంలో. దీంతో ‘ఎమ్మెల్యే’పై ఎఫెక్ట్ బాగానే పడింది.

పోటీలో సరైన సినిమాలు లేక తొలి వీకెండ్లో అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టగలిగిన ఈ చిత్రం రెండో వీకెండ్లో బాగా దెబ్బ తింది. ఇప్పటికి ఈ చిత్ర షేర్ రూ.10 కోట్ల దాకా ఉంది. బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఇంకా ఐదు కోట్ల దాకా షేర్ రావాలి. కానీ పరిస్థితి చూస్తే అది అసాధ్యమనిపిస్తోంది. అంతిమంగా చూస్తే ‘ఎమ్మెల్యే’ ఫ్లాప్ సినిమానే అయ్యేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు