మహేష్ రికార్డుకు మూడినట్లే..

మహేష్ రికార్డుకు మూడినట్లే..

మూడేళ్ల కిందట అమెరికాలో వసూళ్ల మోత మోగించింది మహేష్ సినిమా ‘శ్రీమంతుడు’. ‘బాహుబలి’ సంగతలా వదిలేస్తే.. ఈ చిత్రం ఏకంగా 2.87 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యపరిచింది. అది నాన్-బాహుబలి రికార్డు అయింది. ఆ రికార్డు అప్పట్నుంచి చెక్కు చెదరలేదు. తర్వాత వచ్చిన మహేష్ సినిమాలు దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయాయి.

పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ రికార్డు బద్దలు కొట్టేస్తుందనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఐతే ఇప్పుడు ఊహించని విధంగా రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ అలవోకగా ఆ రికార్డుకు అందుకునేలా కనిపిస్తోంది. సుకుమార్ సపోర్టుతో చరణ్ యుఎస్ బాక్సాఫీస్‌లో ప్రకంపనలు రేపుతున్నాడు.

ఈ చిత్రం తొలి వారాంతంలోనే 2.3 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. శనివారానికే 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఆదివారం 3 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ వారం అంతా కూడా ‘రంగస్థలం’ జోరు కొనసాగేలా ఉండటంతో శ్రీమంతుడు రికార్డు బద్దలవడమే కాదు.. 3 మిలియన్ క్లబ్బులోకి చేరడం కూడా ఖాయమని తెలుస్తోంది. ‘రంగస్థలం’ మీద అమెరికాలో మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. మరీ ఈ స్థాయిలో వసూళ్ల మోత మోగిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.

‘ధృవ’ మినహా చరణ్ సినిమాలేవీ అక్కడ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. కానీ ‘రంగస్థలం’ మాత్రం అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రిమియర్లతోనే ఈ చిత్రం 7 లక్షల డాలర్లు వసూలు చేయడం విశేషం. ఈ వారాంతంలో ‘రంగస్థలం’ 3 మిలియన్ క్లబ్బులోకి చేరొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు