జగపతిని షారుఖ్ అంత మాట అన్నాడట..

జగపతిని షారుఖ్ అంత మాట అన్నాడట..

ఎవరైనా బూతు తిడితే బాధపడతారు. కానీ జగపతిబాబు మాత్రం చాలా సంతోషపడిపోతున్నాడు. తనను ఉద్దేశించి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బూతు మాట ప్రయోగించడం గురించి ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. ఐతే ఆ బూతులో ఒక ప్రశంస కూడా ఉంది లెండి. ఇంతకీ విషయం ఏంటంటే.. జగపతిబాబు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన ‘అంత:పురం’ సినిమాను హిందీలో ‘శక్తి’ పేరుతో కృష్ణవంశీ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో జగపతిబాబు చేసిన పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ చేశాడు. ఐతే ‘అంత:పురం’లో జగపతిబాబు చనిపోయే సన్నివేశంలో ఆయన అభినయం అదిరిపోతుంది. ఆ నటన జగపతికి చాలా గొప్ప పేరు తెచ్చిపెట్టింది.

ఇదే సీన్ హిందీలో చేసేటపుడు షారుఖ్ సరిగా చేయలేకపోయాడట. స్వయంగా షారుఖే ఆ విషయాన్ని అంగీకరించాడట. ‘నేను ఆ బాస్టర్డ్ లాగా నటించలేకపోతున్నాను’ అంటూ కోపంగా కృష్ణవంశీతో అన్నాడట. ఆ విషయాన్ని కృష్ణవంశీ తర్వాత ఒక సందర్భంలో తనతో చెప్పాడని.. షారుఖ్ లాంటి గొప్ప నటుడు తన గురించి అలా అనడం గొప్పగా అనిపించిందని.. కెరీర్లో తాను అందుకున్న గొప్ప ప్రశంస అదే అని జగపతిబాబు చెప్పాడు. ఇక ఇటీవలే విడుదలైన ‘రంగస్థలం’లో తాను పోషించిన ప్రెసిడెంట్ పాత్ర తన కెరీర్లో మరో ప్రత్యేకమైన పాత్ర అని.. పెద్దగా మాటలు లేకుండానే ఆ పాత్రను సుకుమార్ చాలా బాగా తీర్చిదిద్దాడని.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘లెజెండ్’ తర్వాత తనకు అంత పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఇదేనని జగపతిబాబు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు