నానితో సై అంటున్న దిల్ రాజు

నానితో సై అంటున్న దిల్ రాజు

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఉన్నంత ఊపులో మరే హీరో లేడు. మూడేళ్ల కిందట ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెట్టి.. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నాడు. రాజమౌళి అన్నట్లుగా నాని వరుసగా ఎన్ని హిట్లు కొట్టాడనే విషయం కూడా జనాలు మరిచిపోయారు. గత ఏడాది ‘నేను లోకల్’.. ‘నిన్ను కోరి’.. ‘ఎంసీఏ’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లుకొట్టాడతను. కొత్త ఏడాదిలో ‘కృష్ణార్జున యుద్ధం’తో నాని మరో హిట్టు కొట్టేలాగే కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నానికి తనకు మధ్య ‘హిట్’ వార్ నడుస్తోందని అన్నాడు దిల్ రాజు. ‘కృష్ణార్జున యుద్ధం’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర బృందంతో కలిసి తిరుపతికి వెళ్లిన దిల్ రాజు.. అక్కడ మాట్లాడుతూ తనకు, నానికి మధ్య పోటీ గురించి వివరించాడు.

తాను వరుసగా ఎనిమిది హిట్లు కొట్టానని.. తొమ్మిదో హిట్ కోసం చూస్తున్నానని.. మరోవైపు నాని కూడా తన లాగే 8-9 హిట్లు కొట్టి మరో విజయం కోసం చూస్తున్నాడని.. నిర్మాతల్లో తాను.. హీరోల్లో నాని పోటీ పోటీగా సాగుతున్నామని అన్నాడు రాజు. గత ఏడాది నాని కొట్టిన మూడు హిట్లలో రెండు సినిమాలు తనవే అని.. ఇప్పుడు ‘కృష్ణార్జున యుద్ధం’ వేరే బేనర్లో చేసినప్పటికీ నాని మీద నమ్మకంతో ఈ చిత్రాన్న తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా తానే విడుదల చేస్తున్నానని రాజు చెప్పాడు. నాని ఎంచుకుంటున్న కథలే అతడికి మంచి విజయాలందిస్తున్నాయని.. అతనిలాగే సాగిపోవాలని కోరుకుంటున్నానని రాజు అన్నాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’.. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తర్వాత ‘కృష్ణార్జున యుద్ధం’తో హ్యాట్రిక్ కొడతాడని రాజు ధీమా వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English