ఆస్కార్‌కు రంగస్థలం.. ఎక్కువైపోలా?

ఆస్కార్‌కు రంగస్థలం.. ఎక్కువైపోలా?

శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రంగస్థలం’ మీద అన్ని వైపులా ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమా ఉన్న దాని కంటే కొంచెం ఎక్కువ స్థాయిలోనే పొగడ్తలు గుప్పిస్తున్న మాట కూడా వాస్తవం. ఈ కాంబినేషన్‌ కు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా ఇండస్ట్రీ జనాలు ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఆ క్రమంలో కొందరు శ్రుతి మించిన కామెంట్లు చేసేస్తున్నారు.

‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి చేసిన కామెంట్ కూడా అలాంటిదే అని చెప్పాలి. ‘రంగస్థలం’ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని వెంకీ ట్వీట్ చేయడం విశేషం. ప్రతి ఏడాదీ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ కోసం ఇండియా నుంచి ఒక చిత్రాన్ని సెలక్ట్ చేస్తారన్న సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా తెలుగు సినిమా ఏదీ అందులో విజేత కాలేకపోయింది. కనీసం ప్రాథమిక జాబితాలో మన సినిమా చోటు దక్కించుకోవడమూ కష్టంగా ఉంది. ఐతే ‘రంగస్థలం’ సినిమా ఏకంగా ఇండియన్ ఎంట్రీగా ఎంపికై ఆస్కార్ రేసులోకి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు వెంకీ. ఇది చాలా పెద్ద కామెంట్ అనే చెప్పాలి. ‘రంగస్థలం’ మంచి సినిమానే కానీ.. ఆస్కార్ ఎంట్రీగా వెళ్లేంత సీన్ దీనికి ఉందా అంటే సందేహమే.

80ల వాతావరణాన్ని చక్కగా ప్రతిబింబిస్తూ సినిమాను బాగానే తీశారు కానీ.. ఇందులో కథాకథనాలు అంత కొత్తగా ఏమీ ఉండవు. అవార్డు కొల్లగొట్టేంత ప్రత్యేకత ఇందులో ఏమీ లేదు. ఆ మాటకొస్తే దీని బాబు లాంటి సినిమాలు తమిళంలో చాలా వచ్చాయి. అవే ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కాలేకపోయాయి. ఇక ‘రంగస్థలం’ ఎక్కడ? మన దగ్గర ఇలాంటి సినిమాలు అరుదు కాబట్టి మనకు గొప్పగా ఉండొచ్చు కానీ.. తమిళ జనాలకు ఈ సినిమాను చూపిస్తే ఏముంది ఇందులో అంటరేమో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు