చిరు ఇక గర్వంగా చెప్పుకోవచ్చు

చిరు ఇక గర్వంగా చెప్పుకోవచ్చు

రామ్ చరణ్ హీరోగా అరంగేట్రం చేసి పదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో అతడికి మంచి విజయాలే ఉన్నాయి. ‘మగధీర’ రూపంలో ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. కానీ నటుడిగా అతడికి వచ్చిన పేరు మాత్రం అంతంతమాత్రమే. ‘మగధీర’.. ‘చిరుత’ లాంటి సినిమాల్లో బాగానే చేసినప్పటికీ.. ఆ తర్వాత నటుడిగా ఏమాత్రం పరీక్ష పెట్టని రొటీన్ మసాలా సినిమాల్లో నటించి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.

తెలుగులో యువ కథానాయకుల్లో నటుడిగా తక్కువ మార్కులు పడేది చరణ్‌కే అంటే అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన చరణ్‌.. నటుడిగా ఆయనకు తగ్గవాడిగా ఇంకా రుజువు చేసుకోలేదనే చెప్పాలి. ఈ విషయంలో చిరుకు కూడా అసంతృప్తి ఉండకుండా పోదు.

ఐతే ‘రంగస్థలం’ సినిమాతో తనపై ఉన్న అభిప్రాయాల్ని పూర్తిగా మార్చేశాడు చరణ్. కేవలం నటుడిగా తనేంటో రుజువు చేసుకోవడమే కాదు.. నటన అంటే ఇలా ఉండాలి అని ఉదాహరణగా చూపించే స్థాయిలో అద్భుతమైన నటన కనబరిచాడు చరణ్. మామూలుగా సుకుమార్ సినిమాలో ఏ హీరో నటించినా.. అది సుక్కు సినిమాగానే గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ ‘రంగస్థలం’ మాత్రం రామ్ చరణ్‌ సినిమాగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటుంది అంటే అతిశయోక్తి లేదు.

ఆ స్థాయిలో తన నట విశ్వరూపాన్ని చూపించాడతను. సినిమా అంతటా చరణ్ అనేవాడే కనిపించడు. కేవలం చిట్టిబాబు పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంత బాగా ఆ పాత్రలో ఒదిగిపోయాడతను. దీంతో అతడిపై ఓ రేంజిలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది చూసి చిరు పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబ్బయిపోతుండొచ్చు. తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకోవడానికి ఆయనకు ‘రంగస్థలం’ సినిమా చాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు