గౌతమ్ మీనన్ తగ్గాడు కానీ..

గౌతమ్ మీనన్ తగ్గాడు కానీ..

21 ఏళ్ల వయసులోనే ‘ధ్రువంగల్ పదినారు’ అనే వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమా తీసి.. మంచి విజయాన్నందుకుని కోలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు కార్తీక నరేన్. ఈ చిత్రమే తెలుగులో ’16’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి ఫలితాన్నందుకుంది. కార్తీక్‌పై ప్రశంసల జల్లు కురిపించిన వాళ్లలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా ఒకడు.

కేవలం ప్రశంసించడమే కాదు.. అతడి తర్వాతి సినిమాకు తనే నిర్మాత అయ్యాడు. తనకు గౌతమ్ ఇన్‌స్పిరేషన్ అంటూ అప్పట్లో పొగిడాడు కార్తీక్. ఇలా మంచి వాతావరణంలో ఇద్దరూ కలిసి ‘నరగాసురన్’ సినిమా మొదలుపెట్టారు. సినిమా పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు.

రెండు రోజుల కిందట కార్తీక్ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించాడు గౌతమ్. ఐతే కార్తీక్ రివర్స్ అటాక్ గట్టిగానే చేశాడు. దీంతో గౌతమ్ వెనక్కి తగ్గాడు. కార్తీక్‌కు సారీ చెబుతూ ఒక పెద్ద వివరణ లేఖ రాశాడు. తాను ‘నరకాసురన్’ కోసం ఎక్కడెక్కడో ఇన్వెస్టర్లను తెచ్చి డబ్బులు పెట్టానని.. ఐతే ఈ చిత్రానికి బిజినెస్ అయ్యాక వచ్చే డబ్బుల్ని ‘ధృవ నక్షత్రం’ కోసం మళ్లించాలని అనుకున్నానని.. కానీ ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రాలేదని అతను వెల్లడించాడు.

కార్తీక్‌తో వివాదాన్ని పరిష్కరించుకుని సినిమాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు అతను చెప్పాడు. ఈ చిత్ర ప్రధాన పాత్రధారుల్లో ఒకడైన అరవింద్ స్వామి తన పూర్తి రెమ్యూనరేషన్ అందితేనే డబ్బింగ్ చెబుతానని పట్టుబట్టి కూర్చున్న విషయాన్ని కూడా గౌతమ్ వెల్లడించాడు. మొత్తానికి మొన్న ఆవేశపడి కార్తీక్ మీద సెటైర్లు వేసిన గౌతమ్.. ఇప్పుడు తగ్గాడు.

కానీ కార్తీక్ మాత్రం గౌతమ్ మీద ఆగ్రహంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అతను గౌతమ్ మీద కౌంటర్ అటాక్ కొనసాగించడానికి కొన్ని ప్రూఫ్స్‌తో మీడియా ముందుకు రానున్నట్లు వార్తలొస్తున్నాయి. సందీప్ కిషన్.. శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు