పాపం స్మిత్.. ఘోరంగా అవమానించారు

పాపం స్మిత్.. ఘోరంగా అవమానించారు

స్టీవెన్ స్మిత్ ఏమీ నేరస్థుడు కాదు.. అతనేమీ హత్య చేయలేదు.. క్రిమినల్ పనులూ చేయలేదు. తన జట్టును గెలిపించాలనే ఆలోచనతో ఒక మతిమాలిన పని చేశాడు. ఒక తప్పిదానికి బాధ్యుడిగా నిలిచాడు. ఐతే తప్పు బయటపడ్డాక.. నిజాయితీగా ఒప్పుకున్నాడు. అతను చేసిన తప్పుకు పెద్ద శిక్షే పడింది. ఏడాది పాటు ఆటకు దూరం కాబోతున్నాడతను. ఐపీఎల్‌కు సైతం దూరమయ్యాడు.

నిజంగా అతను చేసిందానికి ఇవి పెద్ద శిక్షలే. కానీ వీటికి మించి అతను సొసైటీ నుంచి మరింత పెద్ద శిక్షే ఎదుర్కొంటున్నాడు. నిన్నటిదాకా ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా స్టీవెన్ స్మిత్‌ను చూసిన క్రికెట్ ప్రపంచం అతడిని ఇప్పుడు మోసగాడు అంటోంది. దక్షిణాఫ్రికా ఎయిర్ పోర్టులో అతడికి ఎదురైన అనుభవం చూస్తే ఎవ్వరికైనా బాధ కలగక మానదు.

బాల్ టాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో ఏడాది నిషేధానికి గురైన స్మిత్.. వెంటనే దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి బయల్దేరిన సంగతి తెలిసిందే. అతను ఎయిర్ పోర్ట్‌లో విమానం ఎక్కేందుకు వెళ్తున్నపుడు అతడితో అక్కడి సిబ్బంది, జనాలు వ్యవహరించిన తీరు చూస్తే స్మిత్‌ను చూసి అయ్యో పాపం అనుకోకుండా ఉండలేరు. అతను ఎయిర్ పోర్టులో వెళ్తుండగా జనాలు చీట్ చీట్ అంటూ నినాదాలు చేశారు.

దీని కంటే అతడికి రక్షణగా వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరు మరింత బాధ కలిగించేదే. ఏదో పెద్ద నేరగాడిని తీసుకెళ్లినట్లుగా లాక్కుంటూ.. తోసుకుంటూ అతడిని తీసుకెళ్లారు. అక్కడేమీ జనాలు మీద పడకపోయినా.. స్మిత్‌తో అలా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందో పోలీసులకే తెలియాలి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక స్మిత్ అభిమానులకు మనసు చివుక్కుమనడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు