గౌతమ్ మీనన్ పై యువ దర్శకుడి ఎటాక్

గౌతమ్ మీనన్ పై యువ దర్శకుడి ఎటాక్

తమిళంలో గత ఏడాది ‘ధ్రువంగల్ పదినారు’ అనే వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కార్తీక్ నరేన్. ఆ సినిమా చేసే సమయానికి ఈ యువ దర్శకుడి వయసు కేవలం 21 ఏళ్లు. ఐతే తొలి ప్రయత్నంలోనే హాలీవుడ్ స్థాయిలో థ్రిల్లర్ రూపొందించి అబ్బుర పరిచాడు ఈ కుర్రాడు. ఈ చిత్రం తెలుగులో ‘16’ పేరుతో అనువాదమై ఇక్కడి ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా చూసి ఫిదా అయిపోయిన ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్.. కార్తీక్  రెండో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. ఆ చిత్రమే ‘నరాసురన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో అనువదించారు. సందీప్ కిషన్.. శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు.

కొన్ని నెలల కిందటే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల పక్కకు వెళ్లిపోయింది. కారణమేంటన్నది ఎవరికీ అంతుబట్టలేదు. ఐతే అసలు విషయం ఏంటన్నది ఇప్పుడు బయటపడింది. కార్తీక్‌కు, గౌతమ్‌కు విభేదాలు మొదలయ్యాయట. దీంతో గౌతమ్ ఈ చిత్రాన్ని మధ్యలో వదిలేసి వెళ్లపోయాడట. ఈ విషయం ఇన్ని రోజులు బయటికి రాలేదు. ఐతే గౌతమ్ తాజాగా ట్విటర్లో ఒక యువ బృందాన్ని పొగుడుతూ.. పరోక్షంగా కార్తీక్ మీద విమర్శలు గుప్పించాడు. ఐతే కార్తీక్ దీటుగా స్పందించాడు. దాగుడుమూతలేమీ లేకుండా నేరుగా గౌతమ్ ను ఉద్దేశించి ప్రతి విమర్శలు గుప్పించాడు. ఆయన తీరును దుయ్యబట్టాడు. మరి ఈ వివాదం సంగతేమో కానీ.. ‘నరగాసురన్’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు