చరణ్ ను ధనుష్ తో పోల్చేశాడే..

చరణ్ ను ధనుష్ తో పోల్చేశాడే..

రామ్ చరణ్ ఒకప్పుడు రొటీన్ మాస్ మసాలా సినిమాలతో సాగిపోయేవాడు. అతడికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్నా మిగతా వర్గాల్లో అంత ఆదరణ ఉండేది కాదు. నటుడిగా అంత గొప్ప పాత్రలేమీ చేయకపోవడంతో అతను సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత ఎదుర్కొన్న మాట కూడా వాస్తవం. ఐతే ‘ధృవ’ దగ్గర్నుంచి చరణ్ మీద జనాల అభిప్రాయం మారింది.

ఆ సినిమాలో చరణ్ నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. కథా బలం ఉన్న వైవిధ్యమైన సినిమా చేయడంతో క్లాస్ వర్గాల్లో కూడా అతడికి నెమ్మదిగా బేస్ ఏర్పడింది. ఇప్పుడిక సుకుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో ‘రంగస్థలం’ లాంటి వైవిధ్యమైన సినిమా చేయడం ద్వారా ఈ వర్గం ప్రేక్షకుల్లో మరింత యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు చరణ్.

ఈ సినిమా టీజర్.. ట్రైలర్లలో తన స్క్రీన్ ప్రెజెన్స్.. హావభావాలు.. నటనతోనే చరణ్ ప్రశంసలు అందుకున్నాడు. అతడిపై ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు ప్రశంసలు కురిపించారు. తాజాగా ‘రంగస్థలం’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చరణ్‌ను తెగ పొగిడేశాడు. అతను నేచురల్ ఆర్టిస్ట్ అని కొనియాడాడు. చరణ్ సింగిల్ టేక్ ఆర్టిస్టని కూడా చెప్పాడు. ఈ సినిమా చేస్తూ చరణ్‌ను చాలా గమనించానని.. అతను చాలా టేక్స్ చేసినా.. తొలి టేకే చాలా బాగా వచ్చేదని.. దాన్నే సుకుమార్ ఫైనల్ చేసేవాడని రత్నవేలు తెలిపాడు. రామ్ చరణ్ వ్యక్తిగా కూడా స్వచ్ఛమైన వాడని.. అందుకు చిట్టిబాబు పాత్రను అంత బాగా చేయగలిగాడని అతనన్నాడు.

నటుడిగా చరణ్‌ను తమిళ హీరో ధనుష్‌తో రత్నవేలు పోల్చడం విశేషం. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదని.. తాను పనిగట్టుకుని ఏ హీరోనూ పొగడాల్సిన అవసరం లేదని.. నిజంగా తాను ఫీలై ఈ మాట అంటున్నానని రత్నవేలు చెప్పడం విశేషం. పెద్ద వయసేమీ లేకపోయినా.. నటుడిగా చాలా గొప్ప పేరు సంపాదించి.. జాతీయ అవార్డు కూడా అందుకున్న ధనుష్‌తో చరణ్‌ను పోల్చడం అతడికి గర్వకారణమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English