రాజమౌళి మల్టీస్టారర్లో.. ఇంకో రెండు ‘ఆర్’లు?

రాజమౌళి మల్టీస్టారర్లో.. ఇంకో రెండు ‘ఆర్’లు?

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్లే దీనికి అదిరిపోయే కాంబినేషన్ కుదిరింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు బడా స్టార్లతో మల్టీస్టారర్ తీయబోతున్నాడు జక్కన్న. ఈ చిత్రంపై ఇటీవలే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి. ఐతే ఈ చిత్రంలో నటించే మిగతా తారాగణం గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇందులో హీరోయిన్లెవరు.. విలన్లెవరు అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. రాశి ఖన్నా.. రకుల్ ప్రీత్.. అంటూ కొందరు హీరియన్లు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఐతే ఇప్పుడు కథానాయికగా మరో ఆసక్తికర పేరు తెరమీదికి వచ్చింది. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ రష్మిక మందాన్నను ఈ చిత్రం కోసం రాజమౌళి కన్సిడర్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్నడలో నటించిన తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రష్మిక. కొంత కాలానికే తెలుగులో ఆమె ఒకటికి రెండు సినిమాలు కమిటైంది. అందులో ఒకటి హిట్టయి ఆమెకు మంచి ఆరంభాన్నిచ్చింది. త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో పలకరించబోతోంది రష్మిక. ఆమెకు నిజంగా రాజమౌళి అవకాశమిస్తే అది లైఫ్ టైం ఛాన్స్ అవుతుంది. మరోవైపు తారక్-చరణ్ సినిమాకు విలన్‌గా సీనియర్ హీరో రాజశేఖర్‌ను అనుకుంటున్నట్లు కూడా ఒక రూమర్ బయటికి వచ్చింది. మొన్న రాజశేఖర్ తనయురాలు శివాని కథానాయికగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రాజమౌళి హాజరై రాజశేఖర్‌తో చాలాసేపు మాట్లాడటంతో ఈ ప్రచారం మొదలైంది. నిజంగా రష్మిక.. రాజశేఖర్ ఈ సినిమాకు ఓకే అయితే.. ‘ఆర్ఆర్ఆర్’గా పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్ఆర్ఆర్’ అనాలేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు