మంచి సినిమానే కాదు.. హిట్టు సినిమా

మంచి సినిమానే కాదు.. హిట్టు సినిమా

మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నవన్నీ డబ్బులు తీసుకురావు. ఇందుకు తెలుగులో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. చంద్రశేఖర్ యేలేటి రెండేళ్ల కిందట ‘మనమంతా’ అనే మంచి సినిమా తీశాడు. చూసిన వాళ్లందరూ సినిమా బాగుందనే అన్నారు. కానీ అది కమర్షియల్ గా పెద్ద ఫెయిల్యూర్ అయింది. యువ కథానాయకుడు శ్రీవిష్ణు నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. ‘మెంటల్ మదిలో’ సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ రెండు సినిమాలకూ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఈ నేపథ్యంలో అతడి కొత్త సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ను అందరూ తెగ పొగిడేస్తుంటే సందేహాలు కలిగాయి. ప్రశంసలు సరే.. డబ్బులొస్తాయా అని. కానీ కొన్ని సినిమాల విషయంలో ఒక మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. అదే ‘నీదీ నాదీ ఒకే కథ’ విషయంలోనూ జరిగింది.

ఈ చిత్రానికి ప్రశంసలే కాదు.. వసూళ్లూ వస్తున్నాయి. పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో జనాలు ఈ చిత్రంపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎ’ సెంటర్లలో.. మల్టీప్లెక్సుల్లో దీనికి మంచి ఆదరణ కనిపిస్తోంది. మిగతా చోట్ల కూడా స్పందన పర్వాలేదు. ఈ చిత్రానికి రెండు.. మూడు రోజుల్లో థియేటర్లు పెరగడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 దాకా థియేటర్లు పెంచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి ఈ చిత్రంపై పెట్టుబడి వెనక్కి రావడమే కాదు.. లాభాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ విష్ణు భార్య ప్రశాంతి.. అతడి మిత్రుడు నారా రోహిత్.. వీళ్లందరి ఉమ్మడి స్నేహితుడు కృష్ణ విజయ్ కలిసి నిర్మించారు. ఇంతకుముందు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను కూడా వీళ్లే నిర్మించారు. కమర్షియల్‌గా ఆశించిన ఫలితం దక్కకపోయినా మరో మంచి సినిమాను అందించింది ఈ చిత్ర బృందం. వారికిప్పుడు మంచి ఫలితం దక్కడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు