వేసవి సినిమాల్లో తడిసి ముద్దవుదాం!!

వేసవి సినిమాల్లో తడిసి ముద్దవుదాం!!

ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్‌లో సినిమాల హ‌డావిడి చాలా త‌గ్గింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ, సూర్య‌, రాజ్‌త‌రుణ్ వంటి హీరోలు బాక్సాఫీస్ బ‌రిలో నిలిచినా, ఆ సినిమాలేవీ ప్రేక్ష‌కుల‌ను రంజిప‌చెయ్య‌డంలో స‌ఫ‌లం కాలేక‌పోయాయి. ఇప్పుడు ప‌రీక్ష‌ల సీజ‌న్ ముగుస్తుండ‌డంతో స‌మ్మ‌ర్ సీజ‌న్ సినిమాలు వ‌రుస‌గా సిద్ధ‌మ‌వుతున్నాయి.

రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన మోస్ట్ వెయిటింగ్ మూవీ ‘రంగ‌స్థ‌లం’. ఫ‌స్ట్ లుక్ నుంచి ట్రైల‌ర్ దాకా అన్నీ ఈ సినిమాపై అంచ‌నాల‌ను విప‌రీతంగా పెంచేశాయి. దాంతో ఎప్పుడెప్పుడూ విడుద‌ల అవుతుందా... అని అంద‌రూ ఎదురుచూసిన ఈ సినిమా మార్చి 30న విడుద‌ల‌వుతోంది.  ఆ త‌ర్వాతి వారం అంటే ఏప్రిల్ 5న నితిన్ ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ అంటూ రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అలాగే రిప్ల‌బికే డే నుంచి వాయిదా ప‌డిన మంచు విష్ణు చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర‌’ ఏప్రిల్ 6న విడుద‌ల కాబోతోంది. దీనితో పాటు ప్ర‌భుదేవా, హ‌న్సిక కాంబినేష‌న్‌లో త‌మిళంలో విజ‌య‌వంతం అయిన ‘గులేబాకావ‌ళి’ కూడా అదే రోజు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 12న నాని రావ‌డానికి రెడీ అవుతున్నారు. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నాని ద్విపాత్రాభిన‌యం చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ ఏప్రిల్ 12న విడుద‌లవుతోంది. న్యాచుర‌ల్ స్టార్ వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీద ఉండ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి.

అలాగే బిచ్చ‌గాడు సినిమాతో మంచి విజ‌యం సొంతం చేసుకున్న విజ‌య్ ఆంటోనీ కొత్త చిత్రం ‘కాశీ’ని ఒక్క‌రోజు తేడాతో ఏప్రిల్ 13న విడుద‌ల చేయ‌బోతున్నారు. బిచ్చ‌గాడు త‌ర్వాత స‌రైన హిట్టు లేక‌పోవ‌డంతో ఈ సినిమాతో మ‌ళ్లీ హిట్టు కొట్టి, త‌న మార్కెట్‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నాడు విజ‌య్‌. ఏప్రిల్ 20న ముఖ్య‌మంత్రిగా మ‌హేష్ బ‌రిలోకి దిగ‌బోతున్నాడు. శ్రీ‌మంతుడు వంటి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ కావ‌డంతో ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని తాకాయి. వ‌రుసగా రెండు ఫ్లాపులు తిన్న మ‌హేష్‌కి ఈ చిత్ర విజ‌యం అత్యంత కీల‌కం. ఏప్రిల్ 27న డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ లేవు. ఎందుకంటే ర‌జినీ ‘కాలా’ ఆరోజున విడుద‌ల అవుతోంది. సౌత్ ఇండియా సూప‌ర్‌స్టార్ ర‌జినీ సినిమా కావ‌డంతో ఈ సినిమాపై ఆశ‌లు బాగానే పెట్టుకున్నారు నిర్మాత‌లు.

మే 4న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ దేశ‌భ‌క్తిని చూపించ‌బోతున్నాడు అల్లు అర్జున్‌. ఆ త‌ర్వాతి వారం మే 11న పూరీ ‘మ‌హ‌బూబా’, రాజ్‌త‌రుణ్ ‘రాజుగాడు’ సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. మే  18న విజ‌య్ దేవ‌ర‌కొండ ‘టాక్సీవాలా’, గోపిచంద్ ‘పంతం’ చిత్రాలు రావ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మే 24న క‌ల్యాణ‌కృష్ణ‌, ర‌వితేజ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న ‘నేల‌టికెట్‌’, 25న ఆర్‌జీవీ, నాగార్జున‌ల ‘ఆఫీస‌ర్‌’, క‌ల్యాణ్‌రామ్‌,త‌మ‌న్నాల ‘నా నువ్వే’ చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి.

వీటిల్లో రెండు మూడు చిత్రాలు అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డినా, మిగిలిన సినిమాలు రావ‌డం మాత్రం ప‌క్కా...రంగ‌స్థ‌లం సినిమాతో రామ్‌చ‌ర‌ణ్ సెల‌వుల సీజ‌న్‌ను మొద‌లుపెడితే, నా నువ్వే సినిమాతో క‌ల్యాణ్‌రామ్ స‌మ్మ‌ర్‌ సీజ‌న్‌కు ముగింపు ప‌లుకుతాడ‌న్న మాట‌. స‌మ్మ‌ర్‌లో జ‌రిగే బిజినెసే ఈ ఏడాది సక్సెస్ రేటును నిర్ణ‌యించ‌బోతోంది. మరి రిజల్ట్ ఎలా ఉన్నా కూడా.. ఈ సినిమాల జడివానలో తడసి ముద్దవ్వడానికి మీరు రెడీ అవ్వండే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు