అఖిల్ 3.. హీరోయిన్లతో ప్రయోగాల్లేవు

అఖిల్ 3.. హీరోయిన్లతో ప్రయోగాల్లేవు

అక్కినేని అఖిల్ తొలి రెండు సినిమాలూ తుస్సుమనిపించాయి. ‘అఖిల్’ సినిమా కథే తేడా.. పైగా దాన్ని పేలవంగా తీశారు కాబట్టి దాని ఫలితం విషయంలో మరీ బాధపడాల్సిన పని లేదు. కానీ ‘హలో’ మంచి కథతో తీసిన సినిమానే. దీనికి టాక్ కూడా బాగుంది. విక్రమ్ లాంటి గొప్ప దర్శకుడు తీసిన చిత్రమిది. అయినా ఆశించిన ఫలితం రాలేదు. ఈ రెండు సినిమాల్లో కొన్ని ప్రతికూలతల్ని గమనించవచ్చు.

హీరోయిన్ రెండు సినిమాలకూ ప్రతికూలంగా మారింది. ‘అఖిల్’కు సాయేషా కానీ.. ‘హలో’కు కళ్యాణి కాని ప్లస్ కాలేకపోయారు. ఎన్నెన్నో ఆప్షన్లు పరిశీలించి చివరికి వీళ్లను అఖిల్‌కు జోడీగా తీసుకొస్తే.. వాళ్ల వల్ల ఆ సినిమాలకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఆ హీరోయిన్లను మన జనాలు అసలు ఓన్ చేసుకోలేకపోయారు.

ఐతే అఖిల్ మూడో సినిమా విషయంలో ఇలా జరగకూడదని భావిస్తున్నారట. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ఇక్కడి కథానాయికల్లోనే ఒకరిని తీసుకోవాలని దర్శకుడు వెంకీ అట్లూరి భావిస్తున్నాడట. నాగ్ కూడా ఇదే సూచన చేసినట్లు సమాచారం. ఆల్రెడీ హీరోయిన్ వేట మొదలైంది. ఇంకొన్ని రోజుల్లేనే పేరు ఖరారవుతుంది. ఈ చిత్రం మేలో సెట్స్ మీదికి వెళ్తుంది. వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేయాలన్న ప్రణాళికలో ఉంది చిత్ర బృందం.

ఈ సినిమా స్క్రిప్టు ఇంకా పూర్తి కాలేదు. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే లోపు అంతా రెడీ అవుతుంది. వెంకీ తొలి సినిమా ‘తొలి ప్రేమ’ను నిర్మించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆ చిత్రానికి పని చేసిన తమన్, జార్జి.సి.విలియమ్స్‌లే సంగీతం, ఛాయాగ్రహణం అందించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English