బాహుబలిని కొట్టే సినిమా ఏమైందబ్బా?

బాహుబలిని కొట్టే సినిమా ఏమైందబ్బా?

ఒకప్పుడు దక్షిణాదిన తమిళ సినిమాదే ఆధిపత్యం. గొప్ప సినిమాలు తీయాలన్నా.. భారీ ప్రయత్నాలు చేయాలన్నా.. అవార్డులు కొల్లగొట్టాలన్నా అది తమకు మాత్రమే సాధ్యమని భావించేవాళ్లు కోలీవుడ్ ఫిలిం మేకర్స్. ఈ విషయంలో వాళ్ల ఘనతల్ని తక్కువ చేయడానికి కూడా ఏమీ లేదు.

మణిరత్నం.. శంకర్ లాంటి దర్శకులు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టి మొత్తం తమిళ సినిమా వైపు తిరిగే సినిమాలు తీశారు. ఐతే గత కొన్నేళ్లలో కోలీవుడ్ హవా తగ్గింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను ఎక్కడో తీసుకెళ్లి కూర్చోబెట్టేశాడు రాజమౌళి. ఈ స్ఫూర్తితో తెలుగులో మరిన్ని భారీ ప్రాజెక్టులు తయారవుతున్నాయి. ఐతే కోలీవుడ్ వాళ్లు ఎలాగైనా ‘బాహుబలి’ని కొట్టే సినిమా తీయాలన్న పట్టుదలతో ఉన్నారు. ‘రోబో-2’ మీద భారీ ఆశలతో ఉన్నారు.

ఐతే ‘బాహుబలి’ తరహా భారీ జానపద చిత్రంతోనే సత్తా చాటాలన్న కోరికా తమిళ దర్శకుల్లో ఉంది. ఇందులో భాగంగానే చింబుదేవన్ ‘పులి’ తీశాడు. కానీ అది తుస్సుమనిపించింది. తర్వాత సీనియర్ దర్శకుడు సుందర్ ‘సంఘమిత్ర’ పేరుతో భారీ ప్రాజెక్టు అనౌన్స్ చేశాడు. రెండేళ్లకు పైగా ఈ ప్రాజెక్టు మీద పని చేశాడు. గత ఏడాది ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో జరిపి కొన్ని రోజుల పాటు హడావుడి చేశారు. కానీ ఈ ప్రాజెక్టు ఆ తర్వాత ముందుకే కదల్లేదు. ఎంతకీ షూటింగ్ మొదలు కాకపోవడంతో హీరోయిన్ శ్రుతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. సుందర్ చాలామంది స్టార్లను ట్రై చేసి చివరికి జయం రవి, ఆర్యలతో సర్దుకుపోయాడు కానీ.. చివరికి వాళ్లలోనూ  సినిమాపై ఆశలు పోయాయి. మధ్యలో దీన్ని పక్కన పెట్టి ‘కలగలప్పు-2’ అనే కామెడీ సినిమా తీశాడు సుందర్.

అది పూర్తయి విడుదల కూడా అయింది. కానీ ‘సంఘమిత్ర’ సంగతే ఎటూ తేలలేదు. దీని గురించి ఏ అప్ డేట్ లేదు. శ్రుతి స్థానంలో దిశా పటానీని అనుకున్నారు కానీ.. ఆమె కూడా ఈ సినిమా మొదలవుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఉంది. ఈ మధ్య మీడియా వాళ్లు ఈ సినిమా గురించి అడిగితే.. డైరెక్టర్‌ను కనుక్కోండి అంటూ సమాధానం ఇచ్చింది దిశా. అసలింతకీ ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతుందో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English