నా డబ్బులు నా ఇష్టం అనేసిన నారా రోహిత్

నా డబ్బులు నా ఇష్టం అనేసిన నారా రోహిత్

నారా రోహిత్ నటుడిగా మంచి అభిరుచినే చూపించాడు. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలే చేస్తూ వచ్చాడు. అలాగే అతను నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి వైవిధ్యమైన సినిమాతో ప్రొడ్యూసర్‌గా పరిచయమయ్యాడు. ఆ సినిమాకు మంచి పేరొచ్చినా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు.

ఇప్పుడు రోహిత్ నుంచి ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే మరో వైవిధ్యమైన సినిమా వచ్చింది. ఈ చిత్రానికీ ప్రశంసలైతే బాగానే వస్తున్నాయి. కలెక్షన్లు పర్వాలేదు. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్లో రోహిత్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలు తీయడంలో ఉన్న సంతృప్తే వేరన్నాడు.

నిజానికి ఇలాంటి సినిమాల విషయంలో జనాల అభిప్రాయాలు వేరుగా ఉంటాయని.. కొందరు ఈ తరహా చిత్రాలు తీయడం వల్ల డబ్బులు పోతాయని నేరుగా తనతో అన్నారని.. ఐతే తన డబ్బులు తన ఇష్టమని.. తాను ఇలాగే ఉంటానని.. వైవిధ్యమైన సినిమాలపైనే పెట్టుబడి పెడతానని నారా రోహిత్ స్పష్టం చేయడం విశేషం.

ఈ చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు రోహిత్‌కు ఆప్త మిత్రుడన్న సంగతి తెలిసిందే. ముందు నుంచి అతడిని రోహిత్ బాగా ప్రోత్సహిస్తున్నాడు. తన సినిమాల్లో పాత్రలు ఇవ్వడమే కాక.. అతడిని హీరోగా పెట్టి ఒకటికి రెండు సినిమాలు తీశాడు. విష్ణు భార్య ప్రశాంతి.. రోహిత్-విష్ణుల ఉమ్మడి మిత్రుడు, ‘అసుర’ దర్శకుడు కృష్ణ విజయ్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వాములే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు