అక్క చేసిన మోసంపై షకీలా ఆవేదన

అక్క చేసిన మోసంపై షకీలా ఆవేదన

మలయాళ బి-గ్రేడ్ సినిమాల్లో శృంగార తారగా షకీలాకు ఒకప్పుడు ఏ రేంజిలో ఫాలోయింగ్ ఉండేదో తెలిసిందే. ఆమె సినిమాల్ని నిషేధించాలని మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి వచ్చింది. ఐతే ఆ సినిమాల హవా నడిచినంత కాలం ఆమెకంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సినిమాలు లేవు. అప్పటిదాకా సంపాదించిందంతా కుటుంబానికే ఖర్చు చేసింది షకీలా.

ఏడుగురు సంతానంలో ఒకరైన షకీలా.. అమ్మానాన్నలతో పాటు తోడబుట్టిన వాళ్లందరినీ తనే పోషించింది. తన డబ్బంతా వాళ్లకే ఖర్చు చేసింది. కానీ చివరికి తనకంటూ ఏమీ మిగల్లేదని.. ఎవరి కోసమైతే కష్టపడ్డానో వాళ్లే తనను మోసం చేసి అనాథగా నిలబెట్టేశారని షకీలా ఆవేదన వ్యక్తం చేసింది.

తాను వరుసగా సినిమాలు చేస్తూ కష్టపడే సమయంలో డబ్బు వ్యవహారాలన్నీ తన అక్కకు అప్పగించానని.. కానీ సినిమాలు చాలించాక డబ్బు అవసరమై అడిగితే.. బ్యాలెన్స్ జీరో అని తన అక్క చెప్పిందని షకీలా చెప్పింది. ఏమయ్యాయని అడిగితే.. వేరే వాళ్లకు డబ్బులిస్తే వాళ్లు ఎగ్గొట్టారని చెప్పిందని.. దీంతో చేసేదేమీ లేక ఊరుకున్నానని షకీలా వెల్లడించింది.

ఒక సందర్భంలో ఒక ఫొటోగ్రాఫర్ తన ఫ్యామిలీ ఫొటో అడిగాడని.. అతడిని ఇంటికి పిలిచాక తన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే జారుకున్నారని.. చాలా పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ చివరికి తన అన్నయ్య తాను మాత్రమే ఫొటో దిగాల్సి వచ్చిందంటూ తన సొంత కుటుంబ సభ్యులే తనను ఎలా అవాయిడ్ చేసిందీ వెల్లడించింది షకీలా. తాను ఎవరికోసమైతే కష్టపడి డబ్బులు సంపాదించి పెట్టానో వాళ్లందరూ ఇప్పుడు తనకు దూరమయ్యారని.. తాను ఏ తోడూ లేకుండా ఒంటరి జీవితం గడుపుతున్నానని ఆమె ఆవేదనగా చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు