చేయకపోతే చేయకండి.. కానీ చేయను అని మాత్రం అనకండి

చేయకపోతే చేయకండి.. కానీ చేయను అని మాత్రం అనకండి

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన నితిన్... పవన్‌ను పట్టుకుని సినిమాలు చేయొద్దని అంటాడా..? ఇందులో నిజముండదులే అని తీసి పారేయకండి. కావాలంటే ‘చల్ మోహన్ రంగ’ ప్రి రలీజ్ ఈవెంట్లో నితిన్ ప్రసంగాన్ని ఒకసారి వినండి. ఆ వేడుకలో చివరగా నితిన్ పవన్‌ను ఉద్దేశించి అన్న మాట.. ‘‘మీరు సినిమాలు చేయకండి’’ అనే. కాకపోతే దీనికో డిస్క్లైమర్ పెట్టాడు.

చేయకపోతే చేయకండి.. కానీ చేయను అని మాత్రం అనకండి అని. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగిన పవన్.. ఇకపై తాను సినిమాలు చేసే అవకాశమే లేదని ఒకటికి రెండుసార్లు నొక్కి వక్కాణించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేశాడు నితిన్.

పవన్ సినిమాలు చేయనంటే తన లాంటి అభిమానులందరం చాలా చాలా బాధపడతామని నితిన్ అన్నాడు. పవన్ ఏ రంగంలోకి వెళ్లినా విజయవంతం కావాలనే తామందరం కోరుకుంటామని.. ఐతే అలాగని సినిమాలకు దూరమవుతానంటే మాత్రం తట్టుకోలేమని.. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు సినిమా చేయాలని.. అందుకోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తామని.. ఐదేళ్లకో సినిమా చేస్తానన్నా.. నాలుగేళ్ల పాటు ఎదురు చూడటానికి తామంతా సిద్ధమని నితిన్ ప్రకటించాడు. ఒకవేళ సినిమాలు చేయడం కుదరకపోయినా.. ఆ మాట మాత్రం చెప్పొద్దని.. సినిమాలు చేయకపోయకపోతే చేయకపోయారు కానీ.. ఆ మాట మాత్రం బయటికి చెప్పొద్దని అనేసి తన ప్రసంగాన్ని ముగించాడు నితిన్.